రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● జిల్లాలో 43 బ్లాక్‌స్పాట్లు.. ● గుర్తించిన పోలీసు అధికారులు ● ‘సురక్ష ప్రయాణం’ పేరిట అవగాహన
జగిత్యాలక్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ నేషనల్ హైవే అథారిటీ, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తిస్తోంది. అక్కడ ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎస్పీ అశోక్‌కుమార్ చేపట్టిన ‘సురక్షిత ప్రయాణం’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో 43 బ్లాక్‌స్పాట్లు
జిల్లాలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల స్థలాలను వివిధ శాఖల ఆధ్వర్యంలో పోలీసు శాఖ ప్రత్యేకంగా పరిశీలన చేసి అక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇలా 43 బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. పోలీసు శాఖ కళాబృందాల ద్వారా జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ చేసేలా పెట్రోల్‌బంక్‌లో.. దాబాల్లో పనిచేసే వారికి, యూత్ విలేజ్‌కు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనం నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు.
ప్రమాదసూచిక బోర్డులు ఏర్పాటు
ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అతిగా వేగంతో నడిపే వాహనదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నారు. వాహనదారులకు జరిమానా విధించడంతోపాటు, డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలని భావిస్తున్నారు. రోడ్డుపై లారీలు, ఇతర వాహనాలు నిలపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రివేళల్లో వాహనాలు కనిపించేలా స్ట్రీట్‌లైట్స్ మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
ప్రమాదాలు నివారిస్తాం
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివా రణకు పోలీసు శాఖ, నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ అధికారులు 43 ప్రమాద స్థలాలను గుర్తించాం. అక్కడ ప్రమాదాలను నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
– అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు


