ప్యూరిఫైడ్ దందా..
జగిత్యాల: అసలే వేసవికాలం.. ఆపై తాగునీటి కొరత. దీనిని ఆసరా చేసుకుంటున్న కొందరు వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు అడ్డగోలుగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ.. ఎలాపడితే అలా నీటిని అమ్ముతున్నారు. నాణ్యత ప్రమాణాలు ఉన్నాయో లేవో తెలియదు.. అయినప్పటికీ ప్రజలు వాటినే కొనుగోలు చేసుకుని తాగుతున్నారు. పట్టణాల్లో గల్లీకో వాటర్‌ప్లాంట్ నెలకొల్పుతున్నారు. గ్రామాల్లోనూ విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్యూరిఫైడ్ పేరిట దందా కొనసాగిస్తూ ప్రజల నుంచి అందినంతా దోచుకుంటున్నారు. జిల్లాలో సుమారు రెండు వేలకుపైగానే వాటర్ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. ఒక్క జిల్లా కేంద్రంలోనే 300 నుంచి 350 వరకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా.. ఒక్క వాటర్ ప్లాంట్‌కు కూడా అనుమతి లేకపోవడం శోచనీయం. నిబంధనల ప్రకారం అనుమతితోనే వాటర్‌ప్లాంట్లు నెలకొల్పాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ఒక్కో వాటర్ క్యాన్‌కు రూ.20 ఉండగా.. కూల్‌వాటర్‌ను రూ.40 విక్రయిస్తున్నారు. వివాహాది శుభకార్యాలు, ఇతరత్రా కార్యక్రమాలకు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన వ్యాపారులు నాణ్యత లేని నీటిని అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
లవణాలు మాయం
ప్రస్తుతం శుద్ధి చేస్తున్న నీటిలో లవణాలు ఉండటం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. అందులో ఉపయోగపడే ఖనిజాల శాతం, వాటి ప్రభావంపై ఇటీవల చేసిన అధ్యయంతో మంచివి కావని తేలింది. భూగర్బంలో ఫ్లోరైడ్ శాతం అత్యధికంగా ఉంటే కోంత ఉపయోగం ఉంటుంది. సాధారణ నీటిని సూక్ష్మంగా వడపోయడంతో వ్యర్థాలు, విషతుల్యాలతోపాటు శరీరానికి అవసరమైన ఖనిజాలు మాయమవుతున్నాయి. కీళ్లనొప్పులు, ఎములు బలహీన పడతాయి.
నాణ్యత కరువే..
వాటర్‌ప్లాంట్లలో నీటి నాణ్యత సక్రమంగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం వారానికోసారి వాటర్ క్యాన్లు మార్చాల్సి ఉండగా నెలల తరబడి అవే క్యాన్లు వినియోగిస్తున్నారు. క్యాన్లు కడగకుండానే నీటిని నింపుతున్నారనే ఆరోపణలున్నాయి. క్యాన్లు నాచు పట్టి దుమ్ముతో నిండిపోయి ఉంటున్నాయి. నీటిని నింపుతూ సీల్ వేస్తూ ప్రజలకు అందజేస్తున్నారు. లోపల మినరల్ వాటర్ అన్నట్లు చూపుతున్నారు. అధికారులు మాత్రం వాటర్ ప్లాంట్లపై పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతులు లేవు..
జిల్లాలో వాటర్‌ప్లాంట్లు నెలకొల్పాలంటే నిబంధనల ప్రకారం ఫుడ్‌సేఫ్టీ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వాటర్‌ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ప్యూరిఫైడ్ పేరిట నెలకొల్పుతున్నారు. నిబంధనల ప్రకారం ఫుడ్‌సేప్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో నామమాత్రంగా సర్పంచులు, తహసీల్దార్లు, మున్సిపాలిటీల ద్వారా అనుమతి తీసుకుంటూ నామమాత్రంగా నడిపిస్తున్నారు.
పర్యవేక్షణ కరువే..
జిల్లాలో ఇష్టానుసారంగా వాటర్‌ప్లాంట్లు నెలకొల్పుతున్నా అధికారుల పర్యవేక్షణ మాత్రం కరువైంది. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన వ్యాపారులు ప్యూరిఫైడ్ పేరిట ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఐఎస్‌ఐ మార్క్‌తో ఉన్న నీటినే విక్రయించాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం తనిఖీలు చేసిన దాఖలాలే లేవు.
నిబంధనలివే..
మినరల్ వాటర్ ప్లాంట్ ఇండియన్ స్టాండర్స్ ఇనిస్టిట్యూషన్ (ఐఎస్‌ఐ), బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఎస్‌ఐ) ప్రమాణాలు ఉండాలి.
నిత్యం నీటిని ప్యూరిఫైడ్ చేసేందుకు మైక్రోఫిల్టర్స్ కార్బన్ ఇసుక ఫిల్టర్‌ను వాడాలి.
ప్రతి ఏటా ఐఎస్‌ఐ మార్క్‌ను వేయాలి.
మూడునెలలకోసారి క్యాన్లు మార్చాలి
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వాటర్‌ప్లాంట్లు
నాణ్యత లేని అమ్మకాలు
చోద్యంచూస్తున్న అధికారులు
ప్యూరిఫైడ్ దందా..


