దుర్గంధం ఆగదు
పూడిక తీయరు..
జగిత్యాల: అసలే జిల్లా కేంద్రం.. ప్రధానమైన మున్సిపాలిటీ. సమస్యలు మాత్రం అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలో డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి. నిత్యం తీయకున్నా కనీసం వారానికోసారి తీసినా డ్రైనేజీలు క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండే అవకాశం ఉంది. జిల్లాకేంద్రంలో ఏ డ్రైనేజీ చూసినా ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలతో నిండి ఉంటున్నాయి. ముఖ్యంగా టవర్‌సర్కిల్, తహసీల్ చౌరస్తా, ప్రధానమైన చోట్లలో డ్రైనేజీలపై పూర్తిస్థాయిలో కప్పులు ఉండటం, వ్యాపారాలు కూడా ఇక్కడ అత్యధికంగా ఉండటంతో చెత్తాచెదారం ఎక్కువగా జమ అవుతుంటాయి. తినుబండారాలు, ప్లాస్టిక్ బాటిళ్లు అందులోనే పడేయడంతో అది తీయరాక డ్రైనేజీ అంతా నిండిపోతోంది. వర్షాకాలమైతే ఈ రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. పైకప్పులు పూర్తిస్థాయిలో వేసి ఎక్కడో ఓ చోట చిన్నగా వదిలేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీలపై పూర్తిస్థాయిలో కప్పు వేయకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, నిత్యం డ్రైనేజీలు తీసేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అలాగే పేరుకుపోతున్న పిచ్చిమొక్కలను తొలగించాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తే ఈగలు, దోమలు రాకుండా ఉంటాయని అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, బురద కారణంగా పందులు అందులోనే స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా దారుల వెంట వెళ్లాలంటేనే భయంగా ఉందని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని ఎస్వీఎల్‌ఆర్ గార్డెన్స్ నుంచి ముప్పారపు చెరువు వైపు వెళ్లే డ్రైనేజీ. పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. చుట్టూ పిచ్చిమొక్కలే. మున్సిపల్ అధికారులు చెత్త తొలగించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి రోడ్‌లో శ్మశాన వాటిక సమీపంలో ఉన్న డ్రైనేజీ. సక్రమంగా లేక నీరంతా నిల్వ ఉంటోంది. చెత్తాచెదారం కొట్టుకొచ్చి అందులోనే చేరుతోంది. పూడిక తీస్తేనే తప్ప మురికినీరు ఎటూ వెళ్లదు. చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలగిస్తే కొంత నీరు ప్రవహించే అవకాశం ఉంది. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో గల డ్రైనేజీ. ఇది నిత్యం పూర్తిగా చెత్తాచెదారంతోనే నిండిపోతూ ఉంటుంది. పూడికతీయకపోవడంతో రహదారి వెంట వెళ్తుంటే దుర్గంధం వెదజల్లుతోంది.
ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లోగల గోవిందుపల్లి రోడ్ సమీపంలో ఉండే డ్రైనేజీ. పూర్తిగా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. చెత్తాచెదారం తీయకపోవడంతో కాలనీల్లోకి దుర్గంధం వెదజల్లుతోంది. పాదచారులకు సైతం ఇబ్బందికరంగా మారింది.
ఇది శుభమస్తు గార్డెన్స్ సమీపంలో ఉన్న డ్రైనేజీ. దీనిపై హోటళ్లు నిర్మించారు. అందులోంచి వచ్చే వ్యర్థాలన్నీ ఇందులోనే చేరుకోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అక్కడ వ్యాపారాలు కూడా జరుగుతుంటాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్త తీయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది జిల్లా కేంద్రంలోని ప్రధానమైన టవర్‌సర్కిల్. ఇక్కడ డ్రైనేజీలు ఉన్నా కన్పించవు. ఇరువైపులా వాటిపై కప్పులు వేశారు. దీంతో అక్కడక్కడ మాత్రమే పూడిక తీసేలా ఖాళీ ప్రదేశం ఉంది. నిత్యం వందలాది మంది ఈ ప్రాంతానికి వస్తుంటారు. అధికారులు స్పందించి పైకప్పులను పెద్ద మొత్తంలో తొలగించి డ్రైనేజీని శుభ్రం చేస్తే మురికినీరు వెళ్లే అవకాశం ఉంది.
దుర్గంధం ఆగదు
దుర్గంధం ఆగదు
దుర్గంధం ఆగదు
దుర్గంధం ఆగదు
దుర్గంధం ఆగదు


