ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వాగులో పడి బుధవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లికి చెందిన ఆకారపు మల్లమ్మ(68) మృతిచెందిందని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బావిలో పడి వ్యక్తి మృతి
వెల్గటూర్: బావిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని జగదేవుపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం జైన గామానికి చెందిన సంగెపు మహేశ్ (40) ఉపాధి నిమిత్తం ముంబయిలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదేళ్లుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం సోమవారం కుటుంబంతో కలిసి వచ్చాడు. బుధవారం బహిర్భూమికని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వెల్గటూర్: క్రిమిసంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం గొడిశెలపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లె లచ్చయ్య (58) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదిహేనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నా ఆరోగ్యం బాగుపడడంలేదు. జీవితంపై విరక్తి చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
తండ్రికి కూతురు తలకొరివి
గొల్లపల్లి: కూతురే కొడుకై కన్నతండ్రికి తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని భీంరాజ్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బక్కయ్యకు ఒక్కతే కూతురు. దండేపల్లి మండలం పాతగూడూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొద్దిరోజులుగా కూతురు వద్దనే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. దీంతో ఆయన స్వగ్రామమైన భీంరాజ్‌పల్లికి బుధవారం ఉదయం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బక్కయ్యకు కుమారులు లేకపోవడంతో కూతురు రజిత తండ్రికి తలకొరివి పెట్టింది.
అక్రమ కట్టడాలు కూల్చివేత
మేడిపల్లి: భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్ జి.రవికిరణ్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకారంతో కూల్చివేయించారు. మండల కేంద్రంలోని 1308 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు సంఘాల పేరిట నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు ఆలయాలు, ఈద్గాలు నిర్మించారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం లేకపోవడంతో వేరే గ్రామంలో నిర్మిస్తారని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో గ్రామస్తులు భూములకబ్జా విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి వాటిని తొలగించాలని, ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని తీర్మానించారు. రెండురోజుల క్రితం రైతు, కుల సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి ఆందోళనకు దిగారు. స్పందించిన రెవెన్యూ అధికారులు సున్నితప్రాంతాలైన గుడి, ఈద్గాల అంశాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. అలాగే అందులో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణలను తొలగించారు. ఆర్‌ఐ రాజారాం, ప్రవీణ్, మేడిపల్లి ఎస్సై శ్యామ్‌రాజ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.


