ముగ్గు పోశారు.. పునాదితో ఆపారు
● ముందుకు సాగని ఇందిరమ్మ ఇండ్లు ● మోడల్ ఇళ్లకే పరిమితమైన నిర్మాణాలు ● జిల్లాలో 1,420 నిర్మాణాల లక్ష్యం ● ఇప్పటి వరకు బేస్‌మెంట్ పూర్తయినవి 49
జగిత్యాల:
నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకంలో ఆలస్యం జరుగుతోంది. కొన్నిచోట్ల ముగ్గు పోయగా.. మరికొన్ని చోట్ల పునాదులకే పరిమితం అయ్యింది. ఇంటిస్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో 1,420 ఇళ్ల నిర్మాణాలకు మంజూరు వచ్చింది. జనవరి 26న అధికారులు మంజూరు పత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు. దాదాపు రెండు నెలలు కావస్తున్నా కొన్ని చోట్ల ముగ్గు పోశారే తప్ప పనులు ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా 49 ఇళ్లకు మాత్రమే బేస్‌మెంట్ పూర్తయింది. దీంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు కేవలం మోడల్‌కే పరిమితమయ్యాయి.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ ధర్మపురి మున్సిపాలిటీలతో పాటు మండలాల్లోని పలు గ్రామాల్లో అర్హులైన వారికి ప్రొసిడింగ్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 270 ఇళ్లకే ముగ్గు పోశారు. కొన్ని చోట్ల పునాదులు తవ్వినప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. 49 ఇళ్ల బేస్‌మెంట్ పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకో వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇళ్ల నిర్మాణాల్లో అనేక అక్రమాలు జరిగాయన్న ఉద్దేశంతో ఈసారి ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు. సర్వే సమయంలో చూపించిన స్థలంలోనే ఇళ్లు నిర్మించుకునేలా జియో పెన్సింగ్ విధానాన్ని అమలు చేశారు. సర్వే అప్పుడు చూపిన స్థలంలోనే లబ్ధిదారు ఇల్లు నిర్మించుకోవాలి. కానీ ఆ నిబంధనలు ప్రభుత్వం సడలించింది. లబ్ధిదారు తనకు నచ్చిన చోట ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో నియోజకవర్గాలవారీగా
మంజూరైన ఇండ్లు
నియోజకవర్గం మంజూరైనవి బేస్‌మెంట్ పూర్తయినవి
ధర్మపురి 598 20
జగిత్యాల 321 19
కోరుట్ల 130 04
వేములవాడ 227 01
చొప్పదండి 144 05


