‘రోళ్లవాగు’ నిర్మాణానికి పాలన అనుమతులు
● తాజాగా రూ.16.19 కోట్లు విడుదల ● గేట్ల బిగింపునకు రూ.కోటి.. ● అడవుల అభివృద్ధికి రూ.8కోట్లు ● జీఎస్టీకి రూ.6 కోట్లు.. మిగిలినది కంకర పర్మిట్లకు
సారంగాపూర్: బీర్‌పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం రూ.153 కోట్ల తుది అంచనాలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. 2015–16లో రూ.62 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ఆధునీకరరణకు ఇప్పటి వరకు పెరిగిన అంచనాలతో రూ.136 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం 90 శాతం పూర్తయినా ప్రాజెక్టుకు మూడు గేట్లు బిగించాల్సి ఉంది. నిధుల కొరతతో పనులు నిలిచిపోయి ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు పనులకు రూ.136.81 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం మరో రూ. 16.19 కోట్లు (మొత్తం రూ.153 కోట్లు) ఖర్చు చేయడానికి పరిపాలన అనుమతులు రావడంతో ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
రూ.16.19 కోట్ల వ్యయం ఇలా ఖర్చు చేయనున్నారు
పెరిగిన రూ.16.19 కోట్లలో రూ.8 కోట్లు అడవుల అభివృద్ధికి కేటాయించారు. రూ. కోటి మూడు గేట్లు ఏర్పాటుకు, రూ.2 కోట్లు కంకర పర్మిట్ ఫీజ్ కింద చెల్లించనున్నారు. మిగిలిన మొత్తం రూ.6 కోట్లు జీఎస్టీ చెల్లింపులకు వెచ్చిస్తామని డీఈ చక్రూనాయక్ తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి అయితే 15 వేల ఎకరాలకు సాగునీరు
రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తి అయితే బీర్‌పూర్, ధర్మపురి మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డి–53, 12 ఎల్ కాలువ ద్వారా వచ్చిన నీరు వచ్చినట్లు బయటకు వెళ్లిపోతున్నాయి. కాంట్రాక్టర్ మాత్రం అటవీశాఖ అనుమతులు పూర్తిగా వచ్చిన తరువాతే పనులు చేపడతానని పేర్కొన్నట్లు సమాచారం.


