‘రాజీవ్ యువ వికాసానికి’ ఆన్‌లైన్ అవస్థలు
జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుందామనుకున్న నిరుద్యోగుల ఆశలు అడిసయాలవుతున్నాయి. ఈనెల 14 చివరి తేదీ అని ప్రకటించగా.. వరుసగా సెలవులు వచ్చాయి. కుల ధ్రువీకరణ, ఆదాయం సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి రావడంతో యువత తహసీల్దార్ కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని ధోరణితో కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం లేదు. మరోవైపు సైట్ ఓపెన్ కావడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు సెంటర్ల వద్ద యువత పడిగాపులు కాస్తున్నారు. శని, ఆది, సోమవారం సెలవులు రావడంతో తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి ఉన్నాయి. అప్పుడప్పుడు సైట్ ఓపెన్ అవుతున్నా కులం, ఆదాయ సర్టిఫికెట్స్ లేకపోవడం యువతకు ఇబ్బందిగా మారింది.
ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేస్తే మేలు
సెలవుదినాలు కావడంతో మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో నిరుద్యోగుల దరఖాస్తుదారులను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తే బాగుండేది. కానీ జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాలన్నీ మూసి ఉండటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి సెలవుల్లో సైతం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని యువత కోరుతున్నారు.
అంతా గందరగోళం
జగిత్యాలలో 48 వార్డులు ఉండగా.. సైట్‌లో కేవలం 38 వార్డులే చూపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో యువత దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రానికి వెళ్తే కొన్ని వార్డులే కనిపిస్తుండడంతో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. 10 వార్డులు సైట్‌లో కన్పించకపోవడంతో 10 వార్డులకు సంబంధించిన నిరుద్యోగ యువత ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన లింగంపేట, మోతె, టీఆర్‌నగర్ గ్రామాలు కూడా కన్పించడం లేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని వార్డుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చేలా చూడాలని కోరుతున్నారు.
గడువు పొడిగించేనా..?
ఒక వైపు రాజీవ్ యువ వికాస్ పథకం సైట్ ఓపెన్ కాకపోవడం, మరోవైపు అత్యధిక మంది దరఖాస్తులు చేసుకోవడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో సైతం కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సైతం పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఈ మూడు రోజులు సెలవులు రావడంతో వారు సైతం కార్యాలయాలు తెరవడం లేదు. ప్రభుత్వం గడువు పెంచడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైట్లు రూపొందిస్తే తప్ప చాలామంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి సమస్యను పరిష్కరించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
తహసీల్దార్, మీసేవ చుట్టూ నిరుద్యోగ అభ్యర్థులు
సర్వర్‌డౌన్‌తో ఓపెన్‌కాని సైట్
ఈనెల 14తో ముగియనున్న గడువు
ఆదాయ సర్టిఫికెట్ లేకున్నా..
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఆదాయం సర్టిఫికెట్ లేకున్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆదాయం సర్టిఫికెట్ కోసం యువత తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న విషయం తెల్సిందే. మండలాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ బిజీ వచ్చి ఆదాయ సర్టిఫికెట్ పత్రాలు జారీ చేయడంలో తీవ్ర జాప్యం ఎదురవుతోంది. దీంతో నిరుద్యోగుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డు ఉన్నవారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తుల సమయంలో రేషన్‌కార్డు ఉన్న వారు కార్డు నంబరు పొందుపరిస్తే సరిపోతుంది. లేని వారు మాత్రం తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం ఈ రెండింట్లో ఏదైనా ఒకదాంతో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిశోర్ ‘సాక్షి’కి తెలిపారు.
14 వరకే గడువు
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న గ్రామీణ ప్రాంతాల వారు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో.. మున్సిపల్ ప్రజలు స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈనెల 14లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
‘రాజీవ్ యువ వికాసానికి’ ఆన్‌లైన్ అవస్థలు


