డ్రంకెన్ డ్రైవ్‌పై కొరడా
● పట్టుబడితే జైలు, జరిమానా ● జిల్లాలో గతేడాది 7,058 మందిపై.. ● జనవరి నుంచి ఇప్పటి వరకు 2,227 మందిపై కేసులు నమోదు
జగిత్యాలక్రైం: జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నిత్యం వాహనాల తనిఖీతో పాటు డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టి మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నారు. 2021లో జిల్లా వ్యాప్తంగా 4,270, 2022లో 8,619 (వీరిలో 11 మందిపై 304 సెక్షన్ కింద కేసులు), 2023లో 5,831, 2024లో 7,058 కేసులు, ఈఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,227 కేసులు నమోదు చేశారు. జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ విస్తృత తనిఖీలు చేపడుతుంది. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి సమాచారం ట్యాబ్‌ల్లో వెంటనే అప్‌లోడ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు.
కొత్త మిషన్‌లతో..
● జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
● దీంతో ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బ్రీతింగ్ ఎనలైజర్లు పంపిణీ చేయగా మూడురోజుల క్రితం అన్ని పోలీస్‌స్టేషన్లకు ఎస్పీ అశోక్‌కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
● జిల్లా వ్యాప్తంగా చాలా మంది డ్రంకెన్ డ్రైవ్ చే స్తూ రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతుండటంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
● వారు నడిపే వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో పాటు వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవ డం, మద్యం తాగి వాహనం నడిపినట్లు నిర్ధారణ కావడంతో ప్రమాదంలో మరణించిన చాలా కుటుంబాలకు పరిహారం అందడం లేదు.
● దీంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపిన వారు ప్రమాదాలు ఎక్కువగా చేస్తుండటంతో ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది.
పట్టుపడిన చోటే కేసు
జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పట్టుబడిన వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పట్టుబడిన చోటనే బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు చేసి మద్యం తాగినట్లు తేలగానే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు మద్యం తాగి వాహనం నడిపేందుకు జంకుతున్నారు.
నిబంధనలు కఠినం
డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంతటి వారైనా చర్యలు తప్పవు. డ్రంకెన్ డ్రైవ్‌పై శిక్షలు కూడా కఠినతరంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మద్యం తాగి ఎవరు కూడా వాహనాలు నడపరాదు. ఇటీవల ప్రతి పోలీస్‌స్టేషన్‌కు బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్లు అందజేశాం.
– అశోక్‌కుమార్, ఎస్పీ
డ్రంకెన్ డ్రైవ్‌పై కొరడా


