ఏం తప్పు చేశారని ఇంటిపై దాడి చేశారు..?
● నిందితులపై చర్యలు తీసుకోవాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు
గొల్లపల్లి: కాంగ్రెస్ నాయకులు గూండాళ్ల ప్రవర్తించి బీజేపీ నాయకులతోపాటు వారి ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని, వారు ఏం తప్పు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ప్రశ్నించారు. గొల్లపల్లి మండలకేంద్రానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేశ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంగెం కల్యాణ్‌పై కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాత్రి దాడులకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ మేరకు యాదగిరి బాబు ధ్వంసమైన బీజేపీ నాయకుడి ఇంటిని సోమవారం పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారబలంతో ఏదైనా సాధ్యమనే అహంకారంతో దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. తమ నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్‌రెడ్డి తన అనుచరులతో దాడి చేశాడని, ఇలాంటి వాటిని ప్రజలు క్షమించబోరని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికే బండి సంజయ్ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరణామాలు ఉంటాయన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.


