కీబోర్డులో జగిత్యాల వాసికి గిన్నీస్ రికార్డు
జగిత్యాల: నాన్‌స్టాప్‌గా కీబోర్డు వాయించి జగిత్యాలకు చెందిన విద్యార్థి ప్రతీక్ మక్క గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించాడు. జగిత్యాలకు చెందిన మక్క ప్రవీణ్, సుచరిత దంపతుల కుమారుడు ప్రతీక్ చిన్నప్పటి నుంచే కీబోర్డుపై ఇష్టం పెంచుకుని పట్టు సాధించాడు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ హలెల్ మ్యూజిక్ స్కూల్ మేనేజ్‌మెంట్‌కు బోర్డు ఈవెంట్‌లో గిన్నీస్ రికార్డుకు 8 దేశాల నుంచి ఎంట్రీలను ఆహ్వానించింది. 1046 మంది పేర్లు నమోదు కాగా.. ఏడాది పాటు ఆన్‌లైన్‌లో కీబోర్డు శిక్షణ ఇచ్చింది. 2024 డిసెంబర్ 1న 1046 మందితో గంటపాటు ఆన్‌లైన్‌లో నాన్‌స్టాప్ కీబోర్డు ప్లే ఈవెంట్‌ను హలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించింది. అనంతరం గిన్నీస్‌లో రికార్డు కోసం పంపించగా వీరు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రోగ్రాంలో గిన్నీస్ సంస్థ ప్రతినిధి ప్రతీక్‌కు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల వాసులు హర్షం వ్యక్తం చేశారు.


