మెట్‌పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పసుపు క్వింటాల్‌కు రూ.15వేలు పలికింది. ఈ సీజన్‌లో జనవరి 31నుంచి యార్డులో కొనుగోళ్లు మొదలవ్వగా ఇప్పటివరకు వ్యాపారులు 45,386 క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేశారు. ఇందులో కాడిరకం 26,807, గోళరకం 14,995, చూర రకం 3,584 క్వింటాళ్లు ఉన్నాయి. ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.12వేలు చెల్లించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత పెరుగుతూ వచ్చిన ధర.. ప్రస్తుతం రూ.15వేలకు చేరింది. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌కు చెందిన రైతు దేవారెడ్డి ఈ ధర పొందాడు.
నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలంలో ఇటుకబట్టీల దందా జోరుగా సాగుతోంది. రహదారుల పక్కనే నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు ఏర్పాటు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదు. బట్టీల ఏర్పాటుకు ముందుగా స్థానిక గ్రామ పంచాయతీ, ఇండస్ట్రీయల్, మైనింగ్, ఇతర శాఖల అనుమతి తప్పనిసరి. కానీ వ్యాపారులు అవేమీ పట్టించుకోకుండా దందాను కొనసాగిస్తుండడం గమనార్హం. కొండ్రికర్ల, మెట్లచిట్టాపూర్, రంగారావుపేట గ్రామ శివారులో అనుమతి లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో కొందరు వ్యాపారులు లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోకపోగా.. మరికొందరు ట్యాక్స్ చెల్లించడంలేదు. మిగతా అనుమతులు కూడా సరిగ్గా లేవు. ఓ గ్రామ శివారులో ఇటుక బట్టీ నిర్వహిస్తున్న వ్యాపారికి స్థానిక పంచాయతీ కార్యదర్శి లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని, ట్యాక్స్ చెల్లించాలని సూచించగా ‘మీ పైఅధికారితో మాట్లాడుకుంటా అంటూ’ సదరు బదులిచ్చినట్లు తెలిసింది. సదరు వ్యాపారికి గతంలో నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన ఇప్పటికీ లెక్క చేయకపోవడం గమనార్హం. అధికారులు ఇటుక బట్టీల విషయంలో ‘మాములుగా’ వ్యవహరించడంతోనే ఇటుక బట్టీలు అడ్డూఅదుపు లేకుండా నడుస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
రూ.15వేలు పలికిన పసుపు


