అన్నదమ్ములే ఏటీఎం దొంగలు | - | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములే ఏటీఎం దొంగలు

Apr 19 2025 9:28 AM | Updated on Apr 19 2025 9:28 AM

అన్నదమ్ములే ఏటీఎం దొంగలు

అన్నదమ్ములే ఏటీఎం దొంగలు

● ఖాతాదారులు విత్‌డ్రా చేసిన సొమ్ము టార్గెట్‌ ● చాకచక్యంగా పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు

పెద్దపల్లిరూరల్‌: కస్టమర్లు డ్రా చేసుకునే సొమ్మును చాకచక్కగా చోరీ చేయడంలో నేర్పరులైన అన్నదమ్ములను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి డీసీపీ కరుణాకర్‌ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాజస్థాన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడ్డారు. ఈనెల 15న పెద్దపల్లికి చేరుకుని కూనారం రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంను తెరిచారు. డ్రా చేసుకునే సొమ్ము ఖాతాదారుల చేతికి చేరకుండా ఏటీఎంలో ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారాన్ని ముంబైలోని సెక్యూరిటీ విభాగం అధికారులు గుర్తించి ఇక్కడి బ్యాంకర్లను అప్రమత్తం చేశారు. ఏటీఎం చానల్‌ ఎగ్జిక్యూటివ్‌ రజనీకాంత్‌ పెద్దపల్లి చేరుకుని ఏటీఎం పరిశీలించగా, డబ్బు పోలేదని నిర్ధారించారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల చిత్రాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై లక్ష్మణ్‌రావు కేసు నమోదు చేసి ఎటీఎంల వద్ద నిఘా పెంచారు. ఈ క్రమంలో స్థానిక శాంతినగర్‌లో నివాసం ఉండే సింగరేణి ఉద్యోగి పుట్ట శివకుమార్‌ ఏటీఎంలో రూ.500 డ్రా చేశారు. ఆ సొమ్ము బయటకు రాలేదు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా మల్కెర మండలం కరీడకు చెందిన అన్నదమ్ములు సిద్దిక్‌ఖాన్‌, ఆరీఫ్‌ఖాన్‌ ఏటీఎంలోకి వెళ్లి ఆ సొమ్ము తీసుకున్నారు. తర్వాత రైలులో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌ చేరుకున్నారు. అక్కడ తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు.

పెర్‌టో ఏటీఎంలు టార్గెట్‌..

కస్టమర్ల సౌలభ్యం కోసం బ్యాంకర్లు పెర్‌టో కంపెనీకి చెందిన ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని టార్గెట్‌ చేసుకున్న అన్నదమ్ములు సిద్దిక్‌ఖాన్‌, ఆరీఫ్‌ఖాన్‌.. రాజస్థాన్‌కు చెందిన ఆరీఫ్‌ గుటారి, ఆశ్‌మహమ్మద్‌, సాహిల్‌, ఇమ్రాన్‌తో ముఠాగా ఏర్పడ్డారు. ఓ కారులో ఈనెల 5న బయలు దేరి మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు చేరుకున్నారు. మార్గమధ్యంలో ఉజ్జయిని, అకోలా, కండువా, తుల్జాపూర్‌లో చోరీలు చేశారు. చోరీల సందర్భంగా ఈ ముఠా సభ్యుల మధ్య ఈనెల 10న విభేదాలు తలెత్తాయి. దీంతో సిద్దిక్‌ఖాన్‌, ఆరీఫ్‌ఖాన్‌ కారుదిగి బస్సులో హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ పెర్‌టో ఏటీఎంలు కనిపించకపోవడంతో కాజీపేటకు చేరుకున్నారు. కాజీపేట, వరంగల్‌లో కూడా అవిలేవు. దీంతో ఈనెల 14న పెద్దపల్లికి చేరుకున్నారు. కూనారం రోడ్డులోని ఎస్‌బీఐలో పెర్‌టో ఏటీఎంను గుర్తించారు.

‘టి’ ఆకారం ఉన్న కీ తో ఓపెన్‌ చేసి..

ఏటీఎం పరిసరాల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని టి ఆకారంలోని కీతో ఏటీఎం ముందు భాగాన్ని తెరిచి డబ్బు బయటకు వచ్చేమార్గంలో క్యాష్‌ డిస్పెన్సర్‌కు రేకు ముక్క అడ్డుగా ఉంచి ప్లాస్టర్‌ అతికించారు. ఆ తర్వాత ఏటీఎం డోర్‌ను యథాస్థానంలో ఉంచారు. మరుసటి రోజు వచ్చేసరికి డ్రాచేసిన రూ.500 మాత్రమే వారు అనుకున్న చోట ఏటీఎంలో ఆగిపోయింది. ఆ సొమ్మును తీసుకుని కాగజ్‌నగర్‌ వెళ్లేందుకు యత్నించి పోలీసుల చేతికి చిక్కారు. డీసీపీ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి లాడ్జిలో బసచేస్తే వారి సమాచారాన్ని కచ్చితంగా పోలీసులకు అందించాలన్నారు. అంతర్‌రాష్ట్ర దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, సిబ్బంది రాజు, రఘు, రమేశ్‌, ప్రభాకర్‌, సతీశ్‌, అనిల్‌కుమార్‌ను డీసీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement