ఆయన రూటే సప‘రేటు’ | - | Sakshi
Sakshi News home page

ఆయన రూటే సప‘రేటు’

Apr 22 2025 12:19 AM | Updated on Apr 22 2025 12:19 AM

ఆయన రూటే సప‘రేటు’

ఆయన రూటే సప‘రేటు’

● మెట్‌పల్లి మండల పరిషత్‌లో ఓ ఉద్యోగి ఇష్టారాజ్యం ● కార్యదర్శులకు తలనొప్పిగా ఆయన తీరు ● ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ● పనుల విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ● ఆయన బాటలోనే మరో కార్యాలయం ఉద్యోగి

మెట్‌పల్లి మండలంలోని ఓ గ్రామ కార్యదర్శి కొన్ని రోజుల క్రితం జీపీఎఫ్‌ లోన్‌ విషయంపై మండల పరిషత్‌ కార్యాలయంలోని ఓ ఉద్యోగి వద్దకు వెళ్లాడు. ఆ పనికి సంబంధించిన పత్రాలు నిబంధనల ప్రకారం ఉన్నప్పటికీ పెండింగ్‌లో పెట్టాడు. ఎంత బతిమిలాడిన పనిచేయకుండా నెలరోజులకు పైగా తిప్పించుకున్నాడు. చివరకు ఆ కార్యదర్శి తన పైఅధికారి దృష్టికి తీసుకెళ్లాడు. ఆ అధికారి చెప్పినప్పటికీ పనిచేయలేదు. కొద్దిరోజుల తర్వాత ‘కొంతమొత్తం’ ముట్టచెబితేనే పని చేసినట్లు తెలిసింది.

మెట్‌పల్లి మండలంలోని మరో కార్యదర్శి వేతనానికి సంబంధించిన విషయంపై సదరు ఉద్యోగి వద్దకు వెళ్లాడు. పెండింగ్‌లో పెట్టి.. చాలారోజుల తర్వాత పనిపూర్తి చేశాడు. ఆ పనికి సంబంధించిన తర్వాతి ప్రక్రియ మరో కార్యాలయంలో జరగాల్సి ఉంది. ‘కొంతమొత్తం’ ముట్టజెప్పలేదనే కారణంతో మరో కార్యాలయంలో తనకు సన్నిహితంగా ఉండే ఉద్యోగితో ఆ పనిని పెండింగ్‌లో పెట్టించి ఇబ్బందులకు గురిచేయించినట్లు తెలిసింది. ఇలా వీరే కాదు సదరు అధికారి తీరుతో మరికొందరు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా పంచాయతీ కార్యదర్శులను పలు పనుల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై విసుగు చెందిన పంచాయతీ కార్యదర్శులు సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారా..? అంటూ తన పైఅధికారిని సదరు ఉద్యోగి ప్రశ్నించడం గమనార్హం.

ఎంతో ‘కొంత’ ముట్టచెబితేనే..

గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనుల విషయంలో సదరు ఉద్యోగి వద్దకు వెళ్తున్న కార్యదర్శులు ఎంతో కొంత ముట్టచెబితేనే పనులు జరుగుతాయనేది ఇక్కడ బహిరంగ రహస్యంగా మారింది. ఉద్యోగుల వేతనాలు, సరెండర్‌ సెలవులు, ఇంక్రిమెంట్లు ,ఐటీ ఫైలింగ్‌, జీపీఎఫ్‌ లోన్‌, అప్పులకు సంబంధించిన పనులు, మిగతా సర్వీస్‌కు సంబంధించిన పనులకు ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే. లేకుంటే ఆ పనులను పెండింగ్‌లో పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. సదరు ఉద్యోగి ప్రతి పనిని పెండింగ్‌ పెట్టడం, కాసులు ఇస్తేనే పని చేస్తుండడంతో బాధితులందరూ ఇబ్బంది పడుతున్నారు.

ఇక్కడ పూర్తిచేసి..అక్కడ పెండింగ్‌..

తన వద్దకు వచ్చిన కొన్ని పనులను తప్పని పరిస్థితుల్లో ఇక్కడ పూర్తి చేస్తున్న సదరు ఉద్యోగి.. ఆ పనికి సంబంధించి చివరి ప్రక్రియ మరో కార్యాలయంలో పూర్తి కావాల్సి ఉంటే అక్కడ తనకు సన్నిహితంగా ఉండే మరో ఉద్యోగితో పెండింగ్‌లో పెట్టించడం.. లేదా ఏదో కారణం చూపుతూ ఉద్దేశపూర్వకంగానే రిజెక్ట్‌ చేయిస్తున్నట్లు సమాచారం. ఇలా పనులు పూర్తికాకపోవడంతో ‘ఫలానా పని పూర్తికాలేదు సార్‌’ అని సదరు ఉద్యోగి వద్దకు వెళ్తే ‘నా వద్ద పని పూర్తయింది.. కానీ ఆ కార్యాలయంలో పెండింగ్‌ ఉంది..’ అని చెబుతున్నట్లు తెలిసింది. మరో కార్యాలయంలోని ఉద్యోగి వద్దకు వెళ్తే ఆయన మొదటగా ఏదో కారణాలు చెబుతూ, రోజుల తరబడి తిప్పించుకుంటూ.. ఆ తర్వాత ‘చేయి తడిపితేనే’ పనులు పూర్తి చేస్తున్నాడని కొందరు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు.

షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు

పనుల విషయంలో సదరు ఉద్యోగి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కార్యదర్శులు ఫిర్యాదు చేశారు. ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సదరు ఉద్యోగికి ఇప్పటికే షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు.

– మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో, మెట్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement