మామిడి మార్కెట్‌ ఆదాయం పెరిగేనా..? | - | Sakshi
Sakshi News home page

మామిడి మార్కెట్‌ ఆదాయం పెరిగేనా..?

Apr 22 2025 12:20 AM | Updated on Apr 22 2025 12:20 AM

మామిడి మార్కెట్‌ ఆదాయం పెరిగేనా..?

మామిడి మార్కెట్‌ ఆదాయం పెరిగేనా..?

● రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం ● మార్కెట్‌కు ఫీజు మాత్రం అంతంతే ● ఏటా రూ.70లక్షలు దాటని ఆదాయం

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాలలోని చల్‌గల్‌ మామిడి మార్కెట్‌లో ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతున్నా.. మార్కెట్‌ ఫీజు మాత్రం అంతంతమాత్రంగానే వస్తోంది. మార్కెట్‌ అధికారుల నిర్లక్ష్యంతో వ్యాపారులు ఇష్టారీతిన ఫీజు చెల్లిస్తుండటంతో సరైన ఆదాయం రావడం లేదు. మామిడి మార్కెట్‌ ఏర్పాటై 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆదాయం ఏటా రూ.50లక్షల నుంచి రూ.60లక్షలలోపే ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

రూ.కోట్లలో మామిడి వ్యాపారం

చల్‌గల్‌లో మామిడి మార్కెట్‌ 2005లో సుమారు 23 ఎకరాల స్థలంలో ఏర్పాటైంది. ఈ మార్కెట్‌లో ఏటా రూ.కోట్లలో వ్యాపారం సాగుతుంది. కాయలు కొనుగోలు చేసేందుకు 88 మంది కమీషన్‌ ఏజెంట్లు, 59 మంది అడ్తిదారులు ఉన్నారు. వీరంతా ప్రతి సీజన్‌లో రూ.200కోట్ల వరకు వ్యాపారం చేస్తుంటారు. సీజన్‌లో ఇక్కడి నుంచి మామిడిని పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, నాగ్‌పూర్‌ వంటి ప్రాంతాలకు రోజుకు కనీసం 5 నుంచి 10 లారీలు తరలిస్తుంటారు. పెద్దలారీలో 12 నుంచి 15 టన్నులు, చిన్న లారీలో 8 నుంచి 10 టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. ఐదారేళ్లుగా సగటున టన్ను మామిడికాయల రేటు రూ.30 వేల వరకు ఉంది. పెద్ద లారీలో వెళ్లే 15 టన్నుల మామిడికి టన్నుకు రూ.30వేల చొప్పున, రూ.4.50 లక్షలు అవుతుంది. మామిడికాయల కొనుగోలు విలువ ప్రకారం వ్యాపారులు ఒక శాతం మార్కెట్‌ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రకారం ఒక్కో లారీకి రూ.4500 మార్కెట్‌ ఫీజు చెల్లించాలి. మామిడికాయ రేటు పెరిగినప్పుడల్లా.. రేటు ప్రకారం మార్కెట్‌ ఫీజు వసూలు చేయాలి. వ్యాపారులు అధిక రేటు పెట్టి మామిడికాయలు కొనుగోలు చేసినప్పటికీ తక్కువ రేటుకు కొన్నామని చెప్పి ఆ మేరకు అధికారులు మార్కెట్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌ ఫీజుకు గండి పడుతోంది. గతేడాది రూ.63.29లక్షలు మాత్రమే వసూలైంది. 2018లో రూ.71.89 లక్షలు, 2019లో రూ.64.01లక్షలు, 2020లో రూ.69.65 లక్షలు, 2021లో రూ.91.70 లక్షలు, 2022లో రూ.60.90 లక్షలు, 2023 రూ.43.28 లక్షల ఫీజు మాత్రమే వసూలైంది.

ప్రారంభం నామమాత్రం

దివంగత వైఎస్‌ హయాంలో అప్పటి మంత్రి జీ వన్‌ రెడ్డి పట్టుబట్టి మామిడి మార్కెట్‌ను జగి త్యాలకు తెచ్చారు. రూ.కోట్లు విలువైన వాలంతరీ సంస్థ స్థలాన్ని మార్కెట్‌కు కేటా యించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎమ్మెల్యే సంజ య్‌కుమార్‌ ఒత్తిడితో మరో 10 ఎకరాలు కేటాయించింది. స్థలంతోపాటు దాదాపు రూ.6కోట్ల నుంచి రూ.7కోట్లతో వ్యాపారుల కోసం షెడ్లు నిర్మించారు. మార్కెట్‌ ప్రారంభ సమయంలో వ్యాపారులు, రైతులకు మార్కెట్‌ను పరిచయం చేసేందుకు లారీకి రూ.500 నుంచి రూ.వెయ్యి ప్పున నామమాత్రపు మార్కెట్‌ ఫీజు వసూలు చేసారు. అదే అదనుగా తీసుకున్న వ్యాపారులు మార్కెట్‌ ఫీజు చెల్లించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

నిర్వహణకూ సరిపోని పరిస్థితి

మార్కెట్‌కు వచ్చే ఫీజు నిర్వహణకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. కరెంట్‌ బిల్లులు కూడా మార్కెట్‌ నుంచే చెల్లించే పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ స్తంభాలు జరపడం, తాగునీటి వసతి కల్పించడం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వంటి పనులు కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నారు. మార్కెట్‌ను పర్యవేక్షించే నలుగురైదుగురు సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. షెడ్ల నిర్మాణానికి మేడ్చల్‌, ములుగు, నర్సంపేట, కథలాపూర్‌, లక్సెట్టిపేట మార్కెట్‌ల నుంచి రూ.5.20 కోట్లు అప్పు తెచ్చారు. ఆ ఆప్పులకు వడ్డీ చెల్లించేందుకు మార్కెట్‌ ఫీజు సరిపోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement