
ముంచుతున్న ముసురు
జగిత్యాలఅగ్రికల్చర్: మొక్కజొన్న పంట కోతకు వచ్చింది. 15 రోజులుగా ప్రతిరోజూ వర్షం కురుస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మొక్కజొన్న చేనుల్లో నీరు నిలిచిపోయింది. ఆ నీటిని తొలగించేందుకే నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. పంటను కోయలా..? వద్దా అని రైతులు అయోమయంలో పడుతున్నారు. మరికొందరు రైతులు పంటను కోసినప్పటికీ ఆరబెట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
తడిసిముద్ద
జిల్లాలో రెండో ప్రధాన పంటగా మొక్కజొన్నను సుమారు 35వేల ఎకరాల్లో సాగు చేస్తారు. ఆ పంట కోతకు రావడం.. ప్రతిరోజు వర్షం కురవడంతో కో త ఇబ్బందిగా మారింది. కోసిన చొప్ప తడిసి కుళ్లి పోయే పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి వంటి ప్రాంతాల్లో సాగు చేసిన మొక్కజొన్నను కోసి ఆరబెట్టారు. వర్షానికి తడిసిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. సో యాబీన్, పెసర, కంది వంటి పంటలైతే దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో రైతులు దున్ని కొత్తగా పంట వేసే పరిస్థితి నెలకొంది.
అంతరపంటగా పసుపు
పసుపులో అంతరపంటగా మొక్కజొన్న సాగు చేస్తారు. వర్షాలకు నీరు నిలవడంతో తేమ ఆరిపోయేవరకూ మొక్కజొన్నను కోయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే మొక్కజొన్న పసుపుపై పడిపోయి పంట దెబ్బతినే అవకాశం ఉంది. కోసిన కంకులను కుప్పపోస్తే.. వర్షానికి నాని మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొత్తంగా కోతల వేళ వర్షాలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
డిమాండ్ ఉన్నా.. దిగుబడి అంతంతే..
మొక్కజొన్నకు పౌల్ట్రీ పరిశ్రమ నుంచి డిమాండ్ ఉంది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 ఉండగా.. ఓపెన్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.2800 నుంచి రూ.3000 వరకు ఉంది. ఈ ఏడాది తొలిదశ కత్తెర పురుగు దెబ్బతీసింది. గింజ దశలో కోతులు, రామచిలుకలు, అడవి పందులు దెబ్బతీశాయి. ఫలితంగా ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి ఆశిస్తే 15 నుంచి 20 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.