
బొత్తలపర్రె కొండపై ఇరిగేషన్ ఎస్‌ఈ సుధీర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ: కరువుకు కేరాఫ్‌గా మారిన జిల్లాలోని బీడువారిన పొలాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన ప్రభుత్వం.. ఎత్తైన ప్రాంతాల రైతుల సాగు నీటి కష్టాలను సైతం తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మూడు మినీ లిఫ్టు ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు.. రూ.104.92 కోట్ల నిధులతో పాటు ఈ ఏడాది జనవరి 13న పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మినీ లిఫ్టు ట్యాంకుల నిర్మాణానికి ఈనెల 27న వేలేరులో మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. పనులు పూర్తయితే 6,794 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
దేవాదుల నుంచి రిజర్వాయర్లకు..
జిల్లా ఇరిగేషన్ పరిధిలో గండిరామారం, బొమ్మకూరు(నర్మెట), చీటకోడూరు(జనగామ), నవాబుపేట(లింగాలఘణపురం) ఆర్‌ఎస్ ఘన్‌పూర్ (స్టేషన్‌ఘన్‌పూర్), అశ్వరావుపల్లి(రఘునాథపల్లి), మైలారం బ్యాలెన్సింగ్(రాయపర్తి) రిజర్వాయర్లు ఉన్నా యి. దేవాదుల ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్ మీదుగా రిజర్వాయర్లకు నీటిని మళ్లిస్తున్నారు. మొత్తం 965 చెరువులు, కుంటలకు వానాకాలం, యాసంగి సీజన్ల వారీగా గోదావరి జాలలను కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో బీడువారిన పొలాలు సైతం సస్యశ్యామలంగా మారినా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ఎత్తైన ప్రాంతాలకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మినీ లిఫ్టు ట్యాంకులను నిర్మించి గ్రావిటీ కెనాల్ ద్వారా చెరువులతో పాటు ఆయకట్టుకు సాగు నీరందించేలా ప్రణాళిక రూ పొందించింది. ఆయా పనులను ఈ ఏడాది నవంబర్ 23 వరకు నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మినీ లిఫ్టు–1 : తరిగొప్పుల మండలం బొత్తలపర్రె కొండపై మినీ లిఫ్టు ఇరిగేషన్ ట్యాంకు నిర్మాణం చేపట్టనున్నారు. గండిరామారం రిజర్వాయర్ నుంచి కొండపై నిర్మించే మినీ లిఫ్టు ట్యాంకు వరకు 17 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ వేసి మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గ్రామల పరిధి 23 మినీ ట్యాంకులను నింపుతారు. ఈ స్కీంలో చిల్పూరు, తరిగొప్పుల, వేలేరు, జనగా మ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలాల పరిధి లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, మద్దులగూడెం, కన్నారం, పీచర, అబ్దుల్‌నాగారం, నర్సాపూర్, తరిగొప్పుల, సోలిపురం, పోతారం, అంకుషాపూర్, బొంతగట్టునాగారం, కూటిగల్ గ్రామాల్లోని 3,354 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తారు.
మినీ లిఫ్టు–2: స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, హనుమకొండ నియోజకవర్గాల పరిధి ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని ముప్పారం, నారాయణగిరి, వేలేరు, శోడసపల్లి, మల్లికుదుర్ల, శాలపల్లి గ్రామాలకు సాగునీరు అంది స్తారు. ఇందుకు గుండ్లగడ్డ వయా లోక్యాతండా మీదుగా 4.90 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిధి 12 ట్యాంకులను నింపి 1,620 ఎకరాల ఆయకుట్టకు సాగు నీరు పారించేలా ప్రణాళిక రూపొందించారు.
మినీ లిఫ్టు–3: నష్కల్ రిజర్వాయర్ వద్ద పంప్‌హౌస్ నిర్మాణంతో పాటు ట్యాంకు నుంచి 9.09 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేస్తారు. చిల్పూరు, ధర్మసాగర్, ఐనవోలు మండలాల పరిధి వంగాలపల్లి, ధర్మపురం, మల్లక్కపల్లి, వనమాలకనపర్తి, కొండపర్తి, వెంకటా పూర్, ఐనవోలు, సింగారం, పున్నేలు, పంథిని గ్రామాల్లోని 18 ట్యాంకులను నింపి 1,820 ఎకరాల ఆయకుట్టకు సాగునీరు ఇవ్వనున్నారు.
ప్రతి రైతు కళ్లలో ఆనందం చూడాలి
వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి రైతు కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. జిల్లాలోని ఎత్తైన ప్రదేశాలకు సైతం సాగు నీరు అందించేలా మూడు మినీ లిఫ్టు ట్యాంకుల నిర్మాణానికి రూ.104 కోట్లు మంజూరుతోపాటు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. దీంతో 6,794 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది.
– ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే, జనగామ
మినీ లిఫ్టు పైపులైన్ ట్యాంకులు ఆయకట్టు
(కిలోమీటర్లు) (ఎకరాలు)
1 17 23 3,354
2 4.90 12 1,620
3 9.09 18 1,820

మినీ లిఫ్టు ట్యాంకు నిర్మించే బొత్తలపర్రె కొండ
Comments
Please login to add a commentAdd a comment