
పార్టీలో చేరిన వారితో బండి సంజయ్
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను గద్దెనెక్కిన తర్వాత సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా శనివారం డివిజన్ కేంద్రం శివాజీచౌక్ వద్ద తాళ్లపెల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చాడా.. కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఘన్‌పూర్‌లో మెగా లెదర్‌పార్కు, టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తే ఎందరికో ఉపాధి కలిగేదని పేర్కొన్నారు. ఇంటింటికీ భగీరథ నీరన్నాడు.. అడపా దడపా వచ్చేదీ మురికినీరే.. గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఫుల్లుగా ఉన్నాయికానీ.. తాగునీరు అందడం లేదని విమర్శించారు. 18 ఏళ్ల వయస్సుపై వారికే ‘కంటివెలుగు’ నిర్వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశంలో మూడు కోట్ల మందికి ఇళ్లు అందించారు.. అందులో తెలంగాణకు 2.40 లక్షల ఇండ్లు ఇస్తే.. సీఎం అవినీతితో ఎవ్వరికీ ఇండ్లు అందించడం లేదన్నారు. గ్రామాల్లో ఇళ్లు, రోడ్లు, సాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ తదితర సమస్యల్ని పరిష్కరించేందుకు కేసీఆర్ దగ్గర డబ్బులు ఉండవుకానీ.. లిక్కర్, పత్తాలు, డ్రగ్స్, భూమాఫియా, దొంగ, లంగ, లఫంగి పనులకు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. దళితబంధు బీఆర్‌ఎస్ నేతలకు కమీషన్ల బంధుగా మారిందని, వారి అనుచరులు, బంధువులకే అందిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బతుకులు బాగుపడాలంటే పేదల రాజ్యం రావాలని, బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తే పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం, పక్కా ఇళ్లు అందిస్తామని, ఫసల్‌బీమాతో రైతులను ఆదుకుంటా మని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అనంతరం జనగామకు చెందిన మాలతిరెడ్డితో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు, జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, ఇన్‌చార్జ్ పాపారావు, నాయకులు మాదాసు వెంకటేష్, బొజ్జపల్లి సుభాష్, కేవీఎల్‌ఎన్.రెడ్డి, ఉడుగుల రమేష్, వేముల అశోక్, విద్యాసాగర్‌రెడ్డి, ఐలోని అంజిరెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, బొక్క ప్రభాకర్, పవన్‌కుమార్, గట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆయన కుటుంబంలోనే
ఐదుగురికి ఉద్యోగాలు
పేదల రాజ్యంతో బతుకులు మారతాయి
‘ప్రజాగోస–బీజేపీ భరోసా’లో
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment