ఆరోగ్య రక్షణకు రకరకాల తేనీరు
మితంగా తీసుకుంటేనే ఆనందం లేదంటే అనారోగ్యం
నేడు వరల్డ్ ‘టీ’ డే
ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే ద్రవ పదార్థాల్లో ‘టీ’ది ఎప్పుడూ ఉన్నత స్థానమే. అందుకే చాయ్‌ని నమ్ముకుని దేశంలో దాదాపు 50 లక్షల మంది కుటుంబాల ను పోషిస్తున్నారు. టీ తాగితే లాభాలతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రోజూ రెండు కప్పుల టీ తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ‘టీ’లో ఉండే కెఫిన్ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. పోలీఫినాల్స్ ఉన్నందున సీ్త్రలలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఊపిరితిత్తుల కేన్సర్, జీర్ణనాళంలోని పలు భాగాల కు వచ్చే కేన్సర్లకు విరుగుడుగా పని చేస్తుంది.
రోజూ ఉదయం నిద్ర లేవగానే కప్పు టీ తాగనిదే దినచర్య మొదలు కాదు. ఉల్లాసం ఇచ్చేది.. ఒత్తిడి నుంచి సేదతీర్చేది తేనీరే (టీ). నలుగురు ఓ చోట కలిసినా.. ఇంటికి బంధువులొచ్చినా.. మర్యాద పూర్వకంగా ఇచ్చేదీ తేనీరే. పూర్వీకులు తేయాకుతో చేసిన ‘టీ’ మాత్రమే తాగేవారు. ప్రస్తుతం రకరకాల వైరె‘టీ’లు లభ్యమవుతున్నాయి. నేడు(ఆదివారం)అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం సందర్భంగా తాగితే కలిగే ప్రయోజనాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – కాజీపేట
ఉపశమనం కోసం...
ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి టీ తాగడానికి ఎక్కువ మంది వస్తుంటారు. రోజుకు 500 మందికిపైగా మా వద్ద చాయ్ తాగుతారు. – బానోత్ బాలాజీ, టీ తయారీదారుడు, కాజీపేట
ఎవరు కలిసినా టీ తాగుతాం..
ఉదయం నుంచి మొదలు.. నిద్రపోయే వరకు దాదాపు పదికి పైగా చాయ్‌లు తాగుతుంటా. మిత్రులు ఎవరు కలిసినా టీ తాగడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటికి బంధువులొస్తే మర్యాద పూర్వకంగా టీ ఇస్తాం. – తేలు సారంగపాణి, కాజీపేట
చిన్న కప్పు చాలు..
ఖాళీ కడుపుతో టీ తాగొద్దు. కాసిన్ని నీళ్లు తాగాకే తేనీరు సేవించాలి. అల్లం టీ, యాలకుల టీ, మసాలా టీ, లెమన్ గ్రాస్ టీ వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు రెండు చిన్న కప్పుల ‘టీ’ తాగితే మంచిది. ఎక్కువసార్లు చాయ్‌తాగే వారిలో ఆకలి తగ్గుతుంది. ఎసిడిటీ సమస్య వస్తుంది. – డాక్టర్ మధులత, కాజీపేట
Comments
Please login to add a commentAdd a comment