సన్నబియ్యం.. నేతలు రాక ఆలస్యం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ప్రొటోకాల్ సమస్య తప్పలేదు. వాస్తవానికి ఉగాది కానుకగా ప్రకటించిన ఈ పథకాన్ని ఈనెల 1న అన్ని గ్రామాల్లో ప్రారంభించాల్సి ఉంది. వివిధ కారణాలు, ప్రభు త్వ పరమైన కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల హాజరు కాలేదు. దీంతో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు, అధికారులు కూడా ప్రారంభించే సాహసం చేయలేదు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారికంగా ప్రారంభించాకే పంపిణీ చేయాలనుకుంటున్నట్లు అధికారులు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒకటి, రెండు రోజుల ఆలస్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట బారులుదీరి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్ పరిధి ఆరు జిల్లాల్లో 2,315 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 20,958 మెట్రిక్ టన్నుల బియ్యం పేద ప్రజలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉగాది నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల లబ్దిదారు ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
రేషన్‌షాపుల ఎదుట సందడే సందడి..
గ్రేటర్ వరంగల్‌లోని 66 డివిజన్లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం కోసం లబ్ధ్దిదారులు ఉదయం నుంచే రేషన్‌షాపులకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి గురువారం రేషన్‌దుకాణాల్లో అధికారికంగా పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం 8 గంట ల నుంచే రేషన్‌షాపుల వద్ద భారీ సంఖ్యలో లబ్ధిదారులు క్యూలలో నిల్చుంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద ఈ తరహాలో సందడి చూసి చాలా రోజులైందన్న ఆశ్చర్యాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు లేదా సన్నబియ్యం స్టాక్ ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని డీలర్లు చెప్తున్నారు.
మంచి స్పందన ఉంది..
సన్నబియ్యం పథకం అమలుపై ప్రజల్లో మంచి స్పందన ఉంది. పనులకు పోయేటోళ్లు రేషన్ దుకాణం తెరవక ముందే వచ్చి క్యూలో ఉండి తీసుకెళ్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు డీలర్లకు గౌరవ వేతనం, క్వింటాల్‌కు రూ.300 చొప్పున కమీషన్ హామీ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం.
– ఏలూరి యాకన్న, రేషన్‌డీలర్, శాతాపురం
రెండు రోజులపాటు
కొనసాగిన ప్రారంభవేడుకలు
లబ్ధిదారుల బారులు..
రేషన్ దుకాణాల వద్ద సందడి
ఉమ్మడి వరంగల్‌లో 32.61లక్షల మంది కార్డుదారులు
2,315 దుకాణాల ద్వారా
బియ్యం పంపిణీ.. కలెక్టర్‌లు,
ఉన్నతాకారుల పర్యవేక్షణ
సన్నబియ్యం.. నేతలు రాక ఆలస్యం
సన్నబియ్యం.. నేతలు రాక ఆలస్యం


