ధాన్యం కొంటున్నారు...
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం శుక్రవారం సాయంకాలం 3.45 గంటలకు ధాన్యం సేకరణ మొదలు పెట్టారు. ‘కొనేవారేరి?’ శీర్షికన ఈ నెల 4న సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆరా తీశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ సూచనలతో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ హుస్సేన్ మార్కెట్‌కు వచ్చారు. మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేంద్ర, రైతు సంఘాల ప్రతినిధులు, ట్రేడర్లు అడ్తిదారులతో మూడు గంటల పాటు చర్చలు జరిపారు.
సమస్య ఎక్కడంటే..
మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు నష్టం జరగకుండా గతేడాది క్వింటా ధాన్యం రూ.1,850 తగ్గకుండా మినిమం ధర నిర్ణయించారు. ఆ ధర తగ్గకుండా సరుకు నాణ్యత ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విదేశాలకు బియ్యం ఎగుమతికి డిమాండ్ లేకపోవడం, క్వింటాకు రూ.500 తగ్గడంతో మినిమం ధర గిట్టుబాటు కాదని ట్రేడర్లు కొనుగోళ్లకు విముఖత చూపించారు. దీంతో రెండు రోజులుగా మార్కెట్‌లో వేలాది ధాన్యం బస్తాలు పేరుకు పోయాయి. ఈ విషయమై సాక్షిలో వచ్చిన కథనం మేరకు అధికారులు సమస్యను కొలిక్కి తీసుకు వచ్చేందుకు రంగంలోకి దిగారు. ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో ధర విషయమై మాట్లాడారు. మినిమం ధరను రూ.1,750కి తగ్గించాలని కోరగా... రూ.1,790 వరకు సాధ్యం అవుతుందని అధికారులు చెప్పగా.. వ్యాపారులు ఒప్పుకోలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు దాటి పోవడంతో రెండు రోజులుగా నిరీక్షిస్తున్న రైతులు నిరసన తెలిపేందుకు మార్కెట్ వైపు దూసుకు వచ్చారు. అధికారుల తీరును తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ శివరాజ్ రైతులకు నచ్చ చెప్పగా, గొడవ చేయకుండా ఓపిక పట్టారు. పరిస్థితిని పసిగట్టిన అధికారులు క్వింటా ధాన్యం రూ.1,750 కొనుగోలు చేసేలా అంగీకారం తెలుపడం.. వెంటనే ట్రేడర్లు సరుకు కొనుగోలు చేసేందుకు కవర్‌షెడ్, కళ్లంలోకి వెళ్లడంతో రైతులు శాంతించారు. సుమారు 100 మంది రైతుల వద్ద సుమారు 3వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయగా, మరో 7 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.
త్వరగా లిఫ్టింగ్
మరో రెండు రోజుల పాటు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపధ్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా లిఫ్టింగ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రైతుల నుంచి అంగీకార పత్రం..
జనగామ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు రోజుల్లో వచ్చే సరుకులకు రైతుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు. మార్కెట్‌లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో ఈ నెల 4, 5, 6వ తేదీల్లో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ శుక్రవారం మార్కెట్‌కు పెద్ద ఎత్తున ధాన్యం తీసుకువచ్చారు. మార్కెట్‌కు సెలవు ప్రకటించిన సమయంలో తీసుకు వచ్చిన సరుకు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదము, దొంగతనాలు, మరే ఇతర కారణాల చేత ధాన్యానికి నష్టం జరిగే మార్కెట్ కార్యాలయం, అధికారులకు ఎలాంటి బాధ్యత ఉండదని రైతులతో అంగీకార పత్రాన్ని రాయించుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారి నరేంద్ర మాట్లాడుతూ సెలవు సమయంలో సరుకులను మార్కెట్‌కు తీసుకు రావద్దని సూచించారు.
ఏఎంసీలో ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభం
ట్రేడర్లతో మూడుగంటల పాటు చర్చలు
ధాన్యం కొంటున్నారు...


