భూముల అన్యాక్రాంతంపై ఫ్లెక్సీలు
స్టేషన్‌ఘన్‌పూర్: తాటికొండలో సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన మాన్యం భూముల అన్యాక్రాంతంపై శ్రీరామనవమి రోజున దేవస్థానం, గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద పలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన రియల్ ఎస్టే ట్ వ్యాపారి నారబోయిన శ్రీనివాస్‌కల్యాణ్ పేరిట శ్రీరాముడిని పేదవాడిగా ఏమి లేనివాడిగా చేసిందెవరు.. నాయకుల లోపమా, అధికారుల లోపమా, రాముడి ఆస్తి ఎక్కడ అంటూ ప్రశ్నిస్తూ పలు ప్రదేశాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పేరిట ఏ సర్వేనంబర్లలో ఎన్ని ఎకరాల భూమి ఉంది.. తదితర వివరాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో సదరు ఫ్లెక్సీలను చూసిన గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌కల్యాణ్‌ను సంప్రదించగా తాటికొండ సీతారామచంద్రస్వామి దేవస్థానం భూమి 86.35 ఎకరాలు ఉంటుందని, అందులో దాదాపు ఏడు ఎకరాలు అర్చకుడికి ఇవ్వగా 79 ఎకకరాలు ఉండాలన్నారు. ఇందులో దాదాపు 50 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం అయిందని, ఇటీవల వ్యక్తిగత పనులపై తహసీల్దార్ కార్యాలయంలో ధరణిలో చూడగా మొత్తం 79 ఎకరాలు దేవుని మాన్యం భూములుగానే చూపిస్తుందన్నారు. దేవుని పేరిట 79 ఎకరాల భూమి ఉండగా శ్రీరాముడిని పేదవాడిగా చేసి ఎందుకు చందాలు వేసి ప్రతీ ఏటా కల్యాణం నిర్వహించాల్సిన అవసరం ఏముందన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించడం లేదని, ఈ విషయమై ప్రతిఒక్కరూ ఆలోచించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


