సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం
కొత్తగూడ: సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పరిధి గుంజేడులో సన్న బియ్యం పథకాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరుపేదల కడుపు నింపాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంతో వండిన ఆహారాన్ని చిన్నారులతో కలసి భుజించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. చిన్న పాపకు ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహర ఉగ్గును స్వయంగా తినిపించారు. గర్భిణులకు పౌష్టికాహర కిట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్, డీఎఫ్‌ఓ విశాల్‌తో కలిసి ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గూర్చి అధికారులతో చర్చించారు. గుంజేడు ముసలమ్మ జాతరను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ..కొత్తగూడ, గంగారం మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 30 పడకల ఆస్పత్రి భవణ నిర్మాణం స్థల కేటాయింపులో జాప్యంపై సమీక్షించిన మంత్రి.. సమస్యలుంటే పరిష్కరించి ఆస్పత్రి నిర్మాణం జరిగేలా చూడాలని కలెక్టర్, డీఎఫ్‌ఓలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, సీడీపీఓ షబానా అజ్మీ, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, సీ్త్రశిశు
సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
గుంజేడులో సన్న బియ్యం పథకం ప్రారంభం


