జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
జనగామ రూరల్:అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య, భువనగిరి ఎంపీ, దిశ కమిటీ కోకన్వీనర్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో దిశ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) చైర్మన్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కడియం కావ్య మాట్లాడుతూ రెండేళ్లుగా ఒక్కసారి కూడా దిశ సమావేశం నిర్వహించలేదని ఇకపై నిరంతరం దిశ సమావేశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఉపాధి హామీ పథకం కింద 31.7 లక్షల పని దినాలను కూలీలకు కల్పించడం జరిగిందని, అలాగే రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నామన్నారు. ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన పథకం కింద భూగర్భ జలాలను పెంపొందించే విధంగా వాటర్ షెడ్ పనులను చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద పట్టణంలో 760 ఇళ్లకు, గ్రామీణంలో 3,633 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, డీఆర్డీఏ వసంత, ఆర్డీఓ గోపీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్, భువనగిరి ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
కలెక్టరేట్‌లో దిశ సమావేశం


