విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత
దేవరుప్పుల: మండల కేంద్రంలోని జనగామ–సూర్యాపేట రహదారి దేవరుప్పుల చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం స్థానిక దళితుల కమిటీ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురి దాతల సహకారంతో విగ్రహం, గద్దె నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆవిష్కరణ నిలిచిపోయింది. ఇటీవల విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్ అనుబంధ నాయకులకు మా త్రమే ఆహ్వానం పలకడంతో వివాదం తెరమీదకు వచ్చింది. ఈ విషయమై తహసీల్దార్, పోలీసులు నిర్వాహకులతో చర్చించారు. వివాదాస్పదం కాకుండా వ్యవహరించాలని సూచించారు. కేవలం విగ్రహ నిర్మాణ కమిటీ ప్రతినిధులు మా త్రమే విగ్రహాన్ని ఆవిష్కరించాలని సూచించారు. దీంతో నిర్వాహక ప్రతినిధులు జోగు సోమనర్స య్య, చింత యాదగిరి, భాషిపాక అబ్బయ్య, యాదగిరి, సుదర్శన్, ఎల్లేష్ తదితరులు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నాయకులు ఎర్రబెల్లిని విగ్రహం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. అంతా సద్దుమనిగాకా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో అధికార పార్టీ రాద్ధాంతంతో కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. కమిటీ పిలుపుమేరకు దాతగా వచ్చానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పల్ల సుందర్‌రామిరెడ్డి, దయాకర్, రవి, రామ్‌సింగ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


