నేటినుంచి సామాజిక, ఆర్థిక సర్వే
జనగామ: జనగామ పురపాలిక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌కు అనుబంధంగా అమృత్–2.0 పథకంలో భాగంగా నేటి(బుధవారం)నుంచి పట్టణంలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించనున్నారు. పట్టణంలోని 30 వార్డుల పరిధిలో సుమారు 16,400 వ్యాపార, వాణిజ్య సంస్థలు (నిర్మాణాలు) ఉన్నాయి. ఇందులో 10 శాతం అసెట్స్ పరిధిలో కుటుంబాల సర్వే చేపట్టే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలిక సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతీ వార్డులో 10 శాతం కుటుంబాలను సెలెక్టు చేసుకుని ఇంటింటి సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. టౌన్ ప్లానింగ్ నిబంధనలను అనుసరిస్తూ, మాస్టర్ ప్లాన్‌లోని జనరల్ టౌన్ ప్లానింగ్ స్కీం తయారీలో భాగంగా భూ వినియోగ విభజన, రహదారులు, మురికి కాల్వలు, పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, పచ్చదనంకు సంబంధించి కార్యాచరణ రూపొదించాలని అందులో పేర్కొన్నారు. సర్వేలో పట్టణ పేరు, వార్డు నంబర్, ఇంటి యజమాని పేరు, వయసు, ఏరియా పేరు, ల్యాండ్ మార్కు, విద్యార్హతలు, వృత్తి, తదితర వివరాలు నమోదు చేసుకుంటారు. నేటి నుంచి సర్వే ప్రారంభమవుతుందని, పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు.


