హరిబాబును సస్పెండ్ చేయరా.?
భూపాలపల్లి అర్బన్: నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో బీఆర్‌ఎస్ నాయకుడు కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని రాజలింగమూర్తి భార్య సరళ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరళ మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ హత్య రాజకీయాలు చేయడం లేదని చెప్పిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త హరిబాబు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలతోపాటు కేటీఆర్, హరీశ్‌రావుల పాత్ర ఉన్నట్లు దాడి జరిగిన రోజునే పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేస్తే డీఎస్పీ, సీఐలు ఫిర్యాదును రద్దు చేసి వారికి అనుకూలంగా ఫిర్యాదు రాసుకొని సంతకాలు చేయించుకున్నట్లు తెలిపారు. మేడిగడ్డ, బీఆర్‌ఎస్ నాయకుల అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై పోరాటాలు నిర్వహించినందుకే హత్య చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా ఉన్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని, హత్య చేసిన హరిబాబును ఎందుకు ఇప్పటికీ సస్పెండ్ చేయలేదన్నారు. తప్పు చేయని హరిబాబు ఎందుకు తప్పించుకు తిరిగాడ ని ప్రశ్నించారు. తనకు ప్రాణభయం ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇంటి చుట్టూ కొత్త వ్యక్తులు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు.
హరిబాబు బెయిల్ పిటిషన్
కొట్టివేసిన హైకోర్టు..?
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు కొత్త హరిబాబు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల 19న హత్యకు గురి కాగా హరిబాబు ఏ8 నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 4న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు జరుగుతున్న సమయంలోనే మంగళవారం అతడిని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి, జడ్జి ఆదేశాల మేరకు ఖమ్మం జైలుకు తరలించారు. బుధవారం హైకోర్టులో వాదనలు జరుగగా హరిబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment