మే 10లోపు పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మే 10లోపు పనులు పూర్తి చేయాలి

Mar 21 2025 1:25 AM | Updated on Mar 21 2025 1:21 AM

కాళేశ్వరం: మే 10 లోపు పనులన్ని పూర్తి చేసి సరస్వతి నది పుష్కరాలకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ ఆదేశించా రు. మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్‌ శ్రీధర్‌, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరేలతో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా వీఐపీ ఘాట్‌ వద్ద మెట్ల నిర్మాణ పనులను పరి శీలించారు. 150మీటర్ల పొడవు మెట్లను 86మీటర్ల పొడవుకు కుదించిన విషయమై చర్చించారు.

ఘాట్‌ వద్ద రహదారి

వీఐపీ ఘాట్‌ వద్ద రూ.కోటితో కొనసాగుతున్న సరస్వతి విగ్రహం, సుందరీకరణ పనులు పరిశీలించి, విగ్రహ ఏర్పాటుకు స్థలం నిర్ణయించారు. వీఐపీ ఘాట్‌ నుంచి గోదావరి ఘాట్‌ వరకు గోదావరిలో కర్రలు లేదా స్టీల్‌తో రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాల్లో 12 రోజులపాటు గోదావరి హారతి నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

భక్తులకు ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళిక, సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి చేయాల్సిన శాశ్వత, తాత్కాలిక పనులకు ముందుగానే షెడ్యూల్‌ తయారు చేసుకోవాలని, సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాలని పెంచాలని సూచించారు. అంచనాల్లో వ్యత్యాసాలతో చేపట్టే పనులపై రెండు రోజుల్లో నివేదికలు అందచేయాలని సూచించారు.

పుష్కరాలకు ప్రత్యేక యాప్‌

పుష్కర సమాచారం తెలిసేలా ప్రత్యేకంగా యాప్‌ తయారు చేయాలని, విస్తృత ప్రచారానికి అంబాసిడర్‌ను నియమించాలని తెలిపారు. 12 రోజుల కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్‌ తయారు చేయాలని ఈఓ మహేష్‌ను ఆదేశించారు. వేసవి దృష్ట్యా గోదావరిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరిలో నీటి నిల్వలను పరిశీలించాలన్నారు. అన్న సత్రాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్సులు నిలిపే ప్రదేశం, 86గదుల వసతి గృహాన్ని పరిశీలించారు. సమీక్షలో సమావేశంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఇంజనీరింగ్‌ శాఖల ద్వారా చేపట్టనున్న పనుల ప్రగతిని వివరించారు. కాటారం సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, ఏసీ సునీత, ఈఓ మహేష్‌, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రామచందర్‌రావు, ఎస్సైలు తమాషారెడ్డి, పవన్‌ పాల్గొన్నారు.

మే 15 నుంచి 26 వరకు

సరస్వతి పుష్కరాలు

ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌

కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement