భూపాలపల్లి అర్బన్: నర్సింగ్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ‘ఆన్‌లైన్‌లోనే తరగతులు’ శీర్షికతో నర్సింగ్ కళాశాలకు భవనం కరువు అని బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్‌సీ, టీజీఎంఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్తులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని సూచించారు. ప్రధాన ఆస్పత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం నుంచి అవసరమైన సిబ్బందిని సర్దుబాటు చేసి, కళాశాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నర్సింగ్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. తాత్కాలికంగా భవనం వినియోగంపై కమిషనర్‌తో మాట్లాడతానని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజేశం, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి..
వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడదెబ్బ తగలడానికి గల ప్రధాన కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశం అనంతరం వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్, వివిధ శాఖల అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
రెండు అంతస్తుల వినియోగం
జిల్లా ప్రధాన ఆస్పత్రి, డీఎంహెచ్‌ఓ
కార్యాలయం నుంచి సిబ్బంది సర్దుబాటు
కలెక్టర్ రాహుల్ శర్మ