భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 3,449మంది విద్యార్థులకు గాను 3,441 మంది హాజరుకాగా 8మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మొదటిరోజు పరీక్ష కావడంతో విద్యార్థులు ఉదయం 8గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 9గంటల తరువాత విద్యార్థులను క్షణ్ణంగా పరిశీలిస్తూ పరీక్ష హాల్‌లోకి అనుమతించారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ..
జిల్లావ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్‌శర్మ, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఇన్‌చార్జ్ డీఈఓ రాజేందర్ వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో వైద్యం, కరెంట్, రవాణా సౌకర్యం, ఇతర వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించి పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.