దృష్టి లోపం
పిల్లల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
●
● జిల్లాలో 3,449మందికి పరీక్షలు
● 676మందికి లోపం ఉన్నట్లు నిర్ధారణ
● ఆర్‌బీఎస్‌కే పరీక్షల్లో వెల్లడి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో దృష్టి లోపం ఉన్న పిల్లలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ్ (అర్‌బీఎస్‌కే) ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,449మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా 676 మందికి దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా జిల్లాలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తంగా 3,500మందికి కంటి పరీక్షలు చేయనున్నారు.
మూడు, ఆరేళ్లలో పరీక్షలు
బాల్యంలోనే కంటి సమస్యలను గుర్తిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండవు. మూడేళ్ల వయస్సులో కంటి వైద్య పరీక్షలు చేస్తే బొమ్మలను గుర్తు పడుతున్నారా అనేది తేలుతుంది. తిరిగి ఆరేళ్ల వయసులో పరీక్షించాలి. దృష్టి లోపం ఉంటే అద్దాలు, ఇతర సంరక్షణ చర్యలు తీసుకోవాలి.
ప్రతి విద్యార్థినీ
పరీక్షిస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. దృష్టి లోపాలను గుర్తిస్తూ అద్దాల పంపిణీకి నివేదిస్తున్నాం. సమస్య అధికంగా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేస్తాం. జిల్లాలో ఇప్పటివరకు శస్త్ర చికిత్సలు చేసే అవసరం రాలేదు.
– బండి శ్రీనివాస్, జిల్లా నోడల్ అధికారి
పెరుగుతున్న మానసిక సమస్యలు
విద్యార్థులు ఎక్కువ సమయం ఫోన్లు వాడుతుండటంతో దృష్టి లోపంతో పాటు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడికి గురై ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నారు. ఆకలి మందగించడంతో పాటు ఏకాగ్రత, ఆలోచనా శక్తి కోల్పోతున్నారు. బరువు పెరగడంతో పాటు ఎదుగుదల క్షీణిస్తోంది. తలనొప్పితో బాధపడుతున్నారు. అయిదేళ్లలోపు పిల్లలకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇస్తుండటంతో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment