
మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల షెవర్ల కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం, చీరసారె కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓ ఎన్నారై కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు పూజలు చేశారు. డీజె సౌండ్ నృత్యాలతో పలువురు భక్తులు సందడి చేశారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
‘అమ్మవార్ల చరిత్ర గొప్పది’
మేడారం సమ్మక్క– సారలమ్మ చరిత్ర చాలా గొప్పదని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు కొనియాడారు. కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవార్లను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వనదేవతల చరిత్ర నలుదిశలా వ్యాపించేలా తమకున్న వనరులతో పుస్తకాలను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చూస్తామన్నారు. సమ్మక్క– సారలమ్మ జాతరకు జాతీయస్థాయి గుర్తింపును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రజల మనో భావాలను గుర్తించాలన్నారు. వనదేవతలను దర్శించుకున్న వారిలో ప్రొఫెసర్లు గోవాకు చెందిన ప్రకాశ్‌దేశాయ్, తమిళనాడుకు చెందిన లక్ష్మణన్, కేరళ రాష్ట్రానికి చెందిన జోష్‌జార్జి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన అంజిరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శ్రీనివాసులు, కాకతీయ యూనివర్సిటీకి చెందిన సత్యనారాయణ, యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అంకిళ్ల శంకర్, కలిపిండి వినోద్, చేరాల శివప్రసాద్ ఉన్నారు.

మేడారంలో భక్తుల సందడి
Comments
Please login to add a commentAdd a comment