మళ్లీ పులి కలకలం..
కాటారం: పులి మళ్లీ కలకలం సృష్టించింది. మండలంలోని ఒడిపిలవంచ అటవీ ప్రాంతంలోని ఎర్ర చెరువు వద్ద శనివారం ఉదయం గుమ్మాళ్లపల్లికి చెందిన పలువురికి పులి కనిపించినట్లు తెలిసింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ రేంజర్ సురేందర్, సిబ్బంది ఎర్ర చెరువు వద్ద పులి కదలిక ఆనవాళ్లను గుర్తించి పాదముద్రలు(ప్లగ్‌మార్క్స్) సేకరించారు. పులి వీరాపూర్ మీదుగా గూడూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి అన్నారం అడవుల్లోకి వెళ్తుందా లేక గుండ్రాత్‌పల్లి సమీపంలోని గోదావరి వాగు దాటి చెన్నూర్ టైగర్ జోన్ అటవీ ప్రాంతంలోకి వెళ్తుందా అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆ ఒక్క పులి ఏనా..
కాటారం మండలం నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో ఫిబ్రవరి 10న ఓ రైతు ఎద్దు తప్పిపోగా అటవీ ప్రాంతంలోకి వెళ్లగా పులి కనబడటంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి పులి కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ రోజుకో చోట కనిపిస్తూ వచ్చింది. సుమారు నెల రోజుల పాటు కాటారం మండలం నస్తూర్‌పల్లి, వీరాపూర్, గూడూరు, గుండ్రాత్‌పల్లి, ప్రతాపగిరి, మహదేవపూర్ మండలం అన్నారం, పల్గుల, కుదురుపల్లి, మద్దులపల్లి, ఏనకపల్లి అటవీ ప్రాంతాల్లో పులి ముమ్మరంగా చక్కర్లు కొట్టింది. పల్గుల వద్ద ఓ ఎద్దును, రఘుపల్లి సమీపంలో ఓ లేగదూడపై దాడిచేసి చంపింది. ఆ తర్వాత పులి భూపాలపల్లి మండలం కమలాపూర్ అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. కొన్ని రోజులకు ములుగు జిల్లాలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరించిన పులి, ఇతర ప్రాంతాల్లో తిరిగిన పులి ఒక్కటేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పులి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియక అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రైతులు, ఉపాధికూలీలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లి అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల వద్ద కూలీలకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు.
ఒడిపిలవంచ అడవిలో సంచారం
పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు
మళ్లీ పులి కలకలం..


