కల్యాణ మహోత్సవానికి పందిరి పూజ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయంలో వచ్చే నెల 6న శ్రీసీతారాముల కల్యాణం ఉండడంతో పచ్చని పందిరి ముహూర్త కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావు శర్మ, ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్ నిర్వహించారు. పాలకర్రకు కుంకుమ, పసుపుతో అలంకరించి కంకణాలు కట్టి కొబ్బరికాయలు కొట్టి కల్యాణ వేడుకల పందిళ్ల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం తిలకించేందుకు వచ్చే భక్తులకు చలువ పందిళ్లు వేయనున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. అనంతరం లగ్న పత్రికను రాసి సీతాదేవి, రాములవారి తరఫున కమిటీ సభ్యులు, గ్రామస్తులు నిలబడి లగ్న పత్రికను సంపద్రాయబద్ధంగా స్వీకరించారు. నూతన వస్త్రాలను కప్పుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కల్యాణ మహోత్సవ వేడుకలను ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడదాసు శివ, పిట్టల శివ, గార మహేష్, తదితరులు పాల్గొన్నారు.


