భూ సేకరణకు రైతులు సహకరించాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్న ప్రధాన కెనాల్స్ కోసం అవసరమయ్యే భూ సేకరణకు రైతులు సహకరించాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ తెలిపారు. కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో గురువారం భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. గుమ్మాళ్లపల్లి, ఆదివారంపేట, ఒడిపిలవంచ, వీరాపూర్, రఘుపల్లి, జాదారావుపేట గ్రామాలకు సంబంధించిన భూ నిర్వాసితుల వివరాలను అధికారులు చదివి వినిపించారు. ఆదివారంపేట చెరువు నుంచి ఆయా గ్రామాలకు కాల్వల ద్వారా నీరు చేరవేయడం కోసం కాల్వల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికోసం 45.39 ఎకరాల మేర భూమి సేకరించినట్లు చెప్పారు. ఎక్కువ భూమి కోల్పోతున్నప్పటికీ సర్వే అధికారులు రికార్డుల్లో తక్కువ భూమి నమోదు చేశారని, నష్టపరిహారం పెంచాలని, కెనాల్ అలైన్‌మెంట్ మార్చాలని పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కోల్పోయిన భూములకు పరిహారం పూర్తిస్థాయిలో అందలేదని ఆయనకు విన్నవించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ రైతులకు నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, భూ సేకవరణ విభాగం, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్


