దొడ్డి కొమురయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
భూపాలపల్లి: దొడ్డి కొమురయ్యను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆదర్శ ప్రాయుడని చెప్పారు. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో విశిష్టమైన పాత్ర పోషించారని చెప్పారు. రైతుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆయన సేవలను కొనియాడారు. దోపిడీ వ్యవస్థ, వెట్టి చాకిరి విధానాలకు వ్యతిరేకంగా యువతను కూడగట్టుకుని దొరలు, భూస్వాములపై పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి శైలజ, యాదవ, ఇతర కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మందుల కొరత లేకుండా చూడాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఆస్పత్రిని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రిలోని టీ హబ్, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్, ఎన్‌సీడీ సెంటర్, డైస్ బిల్డింగ్‌లను పరిశీలించి వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయబోయే స్కాన్ మిషన్ కోసం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్‌కుమార్‌తో కలిసి పరిశీలించి టీ హబ్‌లో ఒక గదిలో ఎన్‌సీడీ సెంటర్ ఏర్పాటు చేసిన గదులను గుర్తించారు. రోగుల పట్టికను పరిశీలించి, పరీక్షల గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ స్టోర్‌లో నిల్వ ఉన్న మందుల వివరాలు అడిగి రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
దొడ్డి కొమురయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి


