పన్నుల రాయితీపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపాలిటీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంటి పన్నుల ముందుస్తు చెల్లింపుపై ఐదు శాతం రాయితీ, ఎల్‌ఆర్‌ఎస్ 25శాతం రాయితీపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. నిరంతరం పర్యవేక్షణ చేయాలని అసిస్టెంట్ ఇంజనీర్, పంపు ఆపరేటర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు, సిబ్బంది మానస, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండో రోజు పాదయాత్ర
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారా యణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో 12, 13 వార్డుల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పేరిట రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేవన్ మాట్లాడారు. బీజేపీ నాయకులు మహాత్మా గాంధీని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అప్పం కిషన్, పిప్పాల రాజేందర్, స్వామి, రవీందర్, అశోక్, పాల్గొన్నారు.
కామేశ్వరాలయ
పునాది మట్టి తొలగింపు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం పక్కన ఉన్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ ప్రదేశంలో ఉన్న మట్టిని జేసీబీ, ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం ఆలయం అడుగుభాగాన పోసే ఇసుక కొట్టుకుపోకుండా ఆలయం చుట్టూ రెండు మీటర్ల లోతు నుంచి రాయితో గోడను నిర్మించారు. ఆలయం అడుగుభాగంలో ఉన్న లూజ్ మట్టిని తొలగించి లెవలింగ్ పనులు చేస్తున్నారు. మట్టి తొలగించిన అనంతరం ఆలయ అడుగుభాగంలో పెద్దరాళ్లను పేర్చి ఇసుకతో నింపనున్నారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారానే కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించేందుకు పురావస్తుశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పపువ్వు సేకరణపై
అవగాహన
వెంకటాపురం(ఎం): ఇప్పపువ్వు సేకరణపై మండలంలోని బండ్లపహాడ్, ఊట్ల గొత్తికోయ గ్రామాల్లో గిరిజనులకు అటవీశాఖ అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ములుగు ఎఫ్‌ఆర్‌ఓ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పపూవ్వు సేకరణ సమయంలో ఇప్పచెట్ల కింద క్లీనింగ్ కోసం నిప్పు పెట్టవద్దని, గ్రీన్ షాడో నెట్లను ఉపయోగించాలన్నారు. ఇప్పచెట్ల కింద ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఇతర చెట్లు కాలిపోయే ప్రమాదముంటుందన్నారు. ఇప్పచెట్ల కింద చెత్తను తొలగించి గ్రీన్‌నెట్లను వాడుతున్నవారికి అటవీశాఖ తరఫున బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ యాకూబ్ జానీ, ఎఫ్‌ఎస్‌ఓ రాజేశ్వరి, ఎఫ్‌బీఓలు రజిత, స్వర్ణలత, రూప్‌కుమార్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
పన్నుల రాయితీపై అవగాహన కల్పించాలి
పన్నుల రాయితీపై అవగాహన కల్పించాలి


