ఆరు ఎకరాల మామిడితోట దగ్ధం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామక్రిష్ణాపూర్ పరిధిలో గల మోకిరాల తిరుపతిరావుకు చెందిన మామిడి తోటకు సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు రెండు వేల చెట్లు కాలిపోయాయి. చెల్పూరుకు చెందిన తిరుపతిరావు రామక్రిష్ణాపూర్ పరిధిలో ఆరు ఎకరాల్లో హిమయిత్, దశరి రకంకు చెందిన 8 ఏళ్ల వయస్సు గల రెండు వేల మామిడి చెట్లను సాగు చేస్తున్నాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్లుగా క్రాప్ వస్తుందని తిరుపతిరావు పేర్కొన్నారు. మామిడితోట వద్ద వర్కర్లు కాపలా ఉంటున్నారు. సోమవారం ఉదయం కొంతమంది వ్యక్తులు మామిడితోట వైపునకు వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే తోటలో మంటలు చేలరేగడంతో వర్కర్లు నాలుగు మోటార్ల సహాయంతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాలేదు. పంట చేతికి వచ్చేదశలో మామిడిచెట్లు కాలిపోవడంతో పాటు డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తిరుపతిరావు తెలిపారు.
రెండు వేల చెట్లు అగ్నికి ఆహుతి
రూ.20 లక్షల నష్టం
ఆరు ఎకరాల మామిడితోట దగ్ధం


