సహకార సంఘాల పునర్విభజన చేపట్టాలి
భూపాలపల్లి: సహకార సంఘ మార్గదర్శకాల ప్రామాణికంగా సహకార సంఘాల పునర్విభజన చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సహకార సంఘాల పునర్విభజనపై గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, సహకార, వ్యవసాయ, ఉద్యాన, మత్య్స, పశు సంవర్ధక, వరంగల్, కరీంనగర్ డీసీసీబీ డీజీఎం, ఏజీఎంలతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహకార సంఘం మార్గదర్శకాల మేరకు 10 అంశాలను పరిగణనలోకి తీసుకుని 10 నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. సహకార సంఘాల ఏర్పాటు ద్వారా అన్ని గ్రామాల రైతులకు ప్రయోజనం కలగాలన్నారు. ప్రస్తుతం ఉన్న సంఘాలు సుదూరం ఉన్నందున ప్రజలకు సేవలు అందించడానికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని నూతన సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నూతన సంఘాల ఏర్పాటులో మూడు సంవత్సరాల పాటు జరిగిన వ్యాపార లావాదేవీలు, ఆడిట్ నివేదికతో పాటు 9 అంశాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సహకార శాఖ అధికారి వాల్యనాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కుమారస్వామి, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


