గారెపల్లి రిజర్వాయర్ పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కాటారం మండలం గారెపల్లిలో చేపడుతున్న రిజర్వాయర్ 2 బండు పనులను మంగళవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని నిర్వాసిత రైతులు ప్రాజెక్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. భూమి కోల్పోయి, పంట నష్టపరిహారం అందక తమ కుటుంబాలు రోడ్డునపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించేంత వరకు పనులు సాగనివ్వబోమని రైతులు తెల్చిచెప్పారు. ప్రాజెక్ట్ డీఈఈ ఉపేందర్ రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులతో సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తామని డీఈఈ రైతులకు వివరించారు. పరిహారం అందేవరకు పనులు చేపట్టవద్దని రైతులు తెగేసి చెప్పడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


