
28నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 28వ తేదీ నుంచి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల్లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలతో పాటు పట్టణ, సమీప గ్రామాలకు చెందిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆసక్తిగల విద్యార్థులు ఆధార్‌కార్డు జిరాక్స్‌తో పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.
మహిళకు ఆపరేషన్.. క్యాన్సర్ గడ్డ తొలగింపు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం నూతన వైద్యానికి శ్రీకారం చుట్టారు. జిల్లాకేంద్రానికి చెందిన అల్లూరి రాధ కొద్దిరోజులుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. వారం రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చింది. పలు రకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్‌కుమార్ అభినందించారు.
కాల్వల పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఆదివారంపేట చెరువు నుంచి సాగు నీటి సరఫరా కోసం చేపట్టనున్న కాల్వల నిర్మాణం భూ సర్వేను గుమ్మాళ్లపల్లి వద్ద రైతులు గురువారం అడ్డుకున్నారు. కాల్వల నిర్మాణం కోసం తాము విలువైన భూములు కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో తమకు న్యాయం చేకూరదని అభ్యంతరం తెలిపారు. కాల్వల నిర్మాణం అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. సర్వే అధికారులు నచ్చజెప్పినప్పటికీ రైతులు ఒప్పుకోలేదు. సర్వేలో డీఐ రాములు, సర్వేయర్లు రామకృష్ణ పాల్గొన్నారు.
29న హేమాచల క్షేత్రంలో జాతర వేలం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 29న జాతర బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్లూరు గుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో మే 8 నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) ఆత్యంత వైభవంగా జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుట్టపై జరిగే పది రోజుల జాతరలో, జాతర ప్రారంభానికి ముందు మే 1నుంచి 31వరకు నెల రోజులు ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపులు ఏర్పాటు చేసుకుని విక్రయాలు జరిపేందుకు దేవాదాయశాఖ ద్వారా అనుమతి ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు రూ.లక్ష లడ్డు, పులిహోర ప్రసాదాలు తయారు చేసి విక్రయించేందుకు రూ.లక్ష, భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలు (పుట్టు వెంట్రుకలు) పోగు చేసుకునేందుకు రూ.2 లక్షలు, కొబ్బరి ముక్కలకు రూ.10 వేలు చెప్పుల స్టాండ్‌కు రూ.5 వేలు, ఫొటోలు తీసుకునేందుకు రూ.5 వేలు, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 24 నుంచి 28 వరకు దేవస్థానం కార్యాలయంలో రూ.500 చెల్లించి కొటేషన్ కొనుగోలు చేయాలని సూచించారు. కొటేషన్ కొన్న వారికి మాత్రమే, షెడ్యూల్‌లో పొందుపర్చిన దరావత్తు సొమ్ము డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంని పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ హైదరాబాద్ వారి తుది ఆమోద ఉత్తర్వుల మేరకు వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి సమాచారం కోసం హేమాచల క్షేత్రం ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

28నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు