పాలకవర్గాలకే ‘సహకారం’
అచ్చంపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులను ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు అందుకొని పీఏసీఎస్‌లకు పంపించారు. ఎన్నికల ప్రక్రియకు ఆరు నెలల ముందే కసరత్తు మొదలుపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనా.. ప్రస్తుతం పాలకవర్గ పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న సందేహాలకు తాజా ఉత్తర్వులతో తెరపడింది. జిల్లాలోని 87 సొసైటీల పాలకవర్గాలు మరో ఆరు నెలలపాటు కొనసాగనున్నాయి. డీసీసీబీ పాలకవర్గ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీసీఎంఎస్‌కు సంబంధించి అంశం ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్షం. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలకు మరో పదిరోజుల సమయం ఉండటంతో ఈలోగా డీసీఎంఎస్ పాలకవర్గ పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
హర్షాతిరేకాలు..
ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల పదవీకాలం శనివారంతో ముగిసింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 20తో పూర్తవుతుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డీసీసీబీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ పొడిగింపు..
బీఆర్‌ఎస్ హయంలోనూ 2018 ఫిబ్రవరి 4న పాలకవర్గాల పదవీకాలం ముగియగా ఆరు నెలల చొప్పున రెండుసార్లు పర్సన్ ఇన్‌చార్జ్‌ల పదవీకాలాన్ని పొడిగించారు. 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రెండేళ్లు, టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు మూడేళ్లపాటు పొడిగించారు. పర్చన్ ఇన్‌చార్జ్‌లను నియమిస్తే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రపదవీకాలాన్ని పొడిగించింది.
పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లపదవీకాలం ఆరు నెలలు పొడిగింపు
డీసీఎంఎస్‌కు సంబంధించి వెలువడని నిర్ణయం
పాలకవర్గాలకే ‘సహకారం’
Comments
Please login to add a commentAdd a comment