పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి
గద్వాల: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో పొందిన శిక్షణ అనుభవాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ కేంద్ర సచివాలయ సేవల అధికారులకు సూచించారు. ఎంసీఆర్, హెచ్‌ఆర్డీ ఇనిస్టిట్యూట్ 139వ స్థాయి–డీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సచివాలయ సేవల సెక్షన్ ఆఫీసర్లు 16 మందితో మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హల్‌లో కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల క్రియాశీల అమలుతోనే ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి పథకం లక్ష్యం, ఆచరణ విధానాన్ని క్షేత్రస్థాయిలో సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారానే ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచుతుందన్నారు. శిక్షణలో భాగంగా అధికారులు మల్దకల్ మండలంలోని శేషంపల్లి, గద్వాల మండలంలోని మైలగడ్డ, గద్వాల మున్సిపాలిటీలను సందర్శించి పథకాల అమలు తీరును పరిశీలించారని.. ఆయా పథకాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలతో తెలుసుకున్నారని కలెక్టర్ వివరించారు. వ్యవసాయం, డీఆర్డీఓ, మిషన్ భగీరథ, జెన్‌కో, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, స్వచ్ఛభారత్, చేయూత పింఛన్లు తదితర పభుత్వ పథకాలపై విశ్లేషణ చేపట్టారని తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment