సోలార్‌ప్లాంట్లపై అనుమానాలెన్నో?
● గ్రామాల్లో ప్లాంట్ల ఏర్పాటు పేరుతో భూముల లీజు
● సాగు సీజన్ కాకపోవడంతో జోష్ పెంచిన రియల్ ఏజెంట్లు
● 25 ఏళ్ల అగ్రిమెంట్.. లీజుకు ఇచ్చాక వచ్చే ఇబ్బందులపై రైతుల్లో ఆందోళన
● పూర్తిస్థాయిలో అవగాహన లేక అయోమయం
రైతులు అప్రమత్తంగా ఉండాలి
సోలార్ ప్లాంట్ల పేరుతో ఏజెంట్లు గ్రామాల్లో తిరిగి అగ్రిమెంట్లు రాసుకుంటే అధికారులకు తెలియచేయండి. నిజంగానే సోలార్ కంపెనీలకు భూములు కావాల్సి వస్తే వారు నేరుగా ప్రజలను కలిసే అవకాశముంటుంది. లీజులు, రుణాలు ఇలాంటి విషయాలు, ఇంకా మాయమాటలు చెప్పే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి స్వలాభం కోసం, కమీషన్ల కోసం ప్రజలను, రైతులను మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మా సిబ్బంది ద్వారా కూడా సోలార్‌కు సంబందించి గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకుని చర్యలు చేపడతాం.
– పి.రామ్మోహన్, తహసీల్దార్ రాజోళి
●
రాజోళి: నియోజకవర్గంలో చాలామటుకు రైతులు ఆర్డీఎస్ కెనాల్ నీటిపై ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈక్రమంలో సరైన సమయంలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయని, దాని కోసం భూములు లీజుకు కావాలని తిరుగుతున్నారు. కానీ, వీటిపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేక ఏజెంట్ల మాటలు వినాలా.. లేక భూమి లీజుకు ఇచ్చాక భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని, నష్టపోతామా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడం, ఎలాంటి పంటలు సాగు చేయకపోవడం, భూములు ఖాళీగా ఉండటంతో మీ భూములను లీజు కావాలని ఏజెంట్లు రైతుల వెంటపడ్డారు.
గత రెండు నెలలుగా..
గత రెండు నెలల ముందు నుండే ఈ సోలార్ ప్రాజెక్టుకు సంబందించి రియల్‌ఎస్టేట్ ఏజెంట్లు గ్రామాల్లో రైతుల మీద పడ్డారు. ఆర్డీఎస్ కెనాల్ లో సరైన నీరు రావడం లేదని, వర్షాబావ పరిస్థితులు కూడా ప్రతి కూలంగా ఉంటున్నాయని దాని వల్ల సాగు కష్టరంగా మారడమే కాకుండా కౌలుకు తీసుకునే వారు కూడా ముందుకు రావడం లేదని రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. దీంతో రైతులు కూడా వారి మాయలో పడి భూములను లీజుకు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. అలంపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలతోపాటు రాజోళి మండలంలోని మాన్‌దొడ్డి, పచ్చర్ల, చిన్నధన్వాడ, రాజోళి తదిదర గ్రామాలతో పాటు రైతులు వారికి భూములు లీజుకు ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. కాగా.. ఎక్కడైనా సరే కాని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిదిలో ఆరు ఎకరాల నుంచి భూమి కావాలని హడావుడి సృష్టిస్తున్నారురు. లీజుకు ఇప్పించినందుకు కాను ఏజెంట్లకు రైతుల నుంచి 2 నుంచి 4 శాతం దాకా కమీషన్ ఇవ్వాల్సిందే.
వెంటాడుతున్న ఆందోళన
సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు, ప్రజలు చైతన్యవంతులు అయ్యి, టెక్నాలజీని వాడుకునే విధానాలను అలవాటు చేసుకుంటారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ సోలార్ కోసం భూములు లీజుకు ఇస్తే అందులో ఉండే నిబంధనలే రైతులను ఆందోళనలో పడేస్తున్నాయని కొందరు అంటున్నారు. భూమి లీజుకు ఇస్తున్నట్లు 25 ఏళ్ల వరకు అగ్రిమెంటు రాసి ఇవ్వాల్సి ఉంటుందని, ఆ అగ్రిమెంటు ద్వారా లీజు తీసుకున్న వారు దానిపై బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందని, దాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోతే ఆ రుణాలు రైతుల మీద పడే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రైతులు మధ్య భూమి విక్రయించాల్సిన అవసరం వస్తే సోలార్ అగ్రిమెంటు ఉండగానే భూమిని భేరం చేసుకుని అగ్రిమెంటు ముగిశాక భూమిని కొన్న వారికి అప్పచెప్పే అవకాశం ఉంటుందని, దీని ద్వారా భూమిని కొనేందుకు ఎవరూ ముందుకు రారని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూమిని లీజుకు ఇస్తున్నట్లు అగ్రిమెంట్ రాశాక ఏడాదిలో ఇవ్వాల్సిన లీజు నగదు కూడా ఆరు నెలలకు ఒక విడతగా, ఎకరాలో సగం మాదిరిగా చెల్లిస్తారని దీని వల్ల తమకు నగదు పరంగా కూడా మిగిలేది ఏమి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. సాధారణ రైతులకు కౌలుకు ఇస్తే వారు ముందుగానే కౌలు చెల్లించి భూమిని దున్నుకుంటారని, సోలార్ కోసం తీసుకునే వారు రైతులకు ఏ విధంగా లీజు నగదను చెల్లిస్తారనే విషయంలో కూడా స్పష్టత లేదని అంటున్నారు.
అవగాహన కల్పించేవారేరి..?
సోలార్‌తో కలిగే ప్రయోజనాలను తెలియచేస్తూ, రైతులను గ్రామాల్లో అధికారులు చైతన్యం చేయాల్సి ఉంది. అధికారుల కంటే ఎక్కువగా తమ కమీషన్ల కోసం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎక్కువగా గ్రామాల్లో తిరుగుతూ, రైతులను మాయలో పడేస్తూ, వారి కమీషన్లు దండుకునే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగానే సోలార్ కంపెనీలు రైతులకు మేలు చేసే విధంగా నిబంధనలు రూపొందించినప్పటికీ మధ్యలో ఉన్న ఏజెంట్ల ద్వారా అవి పక్కదారి పట్టి, రైతులకు అన్యాయం జరిగే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టకుని అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, సోలార్ కంపెనీ వాళ్లతో సమావేశాలు ఏర్పాటు చేయించి పూర్తి వివరాలను తెలియచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటు సోలార్ కంపెనీలు, అటు రైతులు నష్టపోకుండా అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రాజెక్టుల ఏర్పాటుకు తోడ్పాటు చేయాల్సి ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
సోలార్‌ప్లాంట్లపై అనుమానాలెన్నో?
Comments
Please login to add a commentAdd a comment