
సాక్షి, అమరావతి: ఉప్పాడ జాంధానీ పట్టు నేత కళ మరోసారి కీర్తి పతాక ఎగరేసింది. ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో బుధవారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందించనున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఏళ్లు గడిచినా తరగని విలువ.. ఎటు చూసినా కళాత్మకత ఉట్టిపడే ఉప్పాడ జమ్దానీ(జాంధానీ) పట్టు చీరల ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిందే. వందేళ్ల క్రితమే ఢాకాయ్ జమ్ధానీ నేత నైపుణ్యం ఈ ప్రాంతానికి వచ్చింది.
ఢాకాయ్ జమ్ధానీ అనేది పర్షియన్ పదం. దీనికి పూలకుండీ అని అర్థం. రానురాను ఇక్కడి చేనేత కళాకారులు ప్రత్యేక ముద్రలు తయారు చేసుకుని జమ్ధానీ పట్టులో మరింత కళాత్మక నేత నేస్తున్నారు. సాధారణంగా చేనేతలో చీరకు ఒకవైపు మాత్రమే స్పష్టంగా కన్పిస్తుంది. అదే జమ్ధానీ పట్టు చీర నేత(ఎక్స్‌ట్రా వెస్ట్ టెక్నిక్)తో రెండు వైపులా ఒకే తరహాలో డిజైన్ కన్పించడం ప్రత్యేకం. అందుకే ఇక్కడి నేత చీరలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ప్రాంతానికి వెళితే.. పట్టు చీరల ప్రత్యేక అమ్మకాలకు సంబంధించిన షైన్ బోర్డులు, బ్యానర్లు స్వాగతం పలుకుతాయి. ఊళ్లోకి వెళితే.. రిటైల్ షాపులు, హోల్‌సేల్ ఔట్‌లెట్‌లు కొనుగోలుదారులతో కళకళలాడుతూ కనివిందు చేస్తాయి. ఇళ్లలో గమనిస్తే.. చేనేత మగ్గాల చప్పుడు.. అత్యంత నైపుణ్యంతో వెండి జరీతో చీరల నేత అబ్బుర పరుస్తాయి’.
ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉప్పాడ చేనేతకు ఊతం
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో చేనేతకు మరింత ఊతం వచ్చిందని తెల్సిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర చేనేత జౌళి శాఖ కార్యదర్శి కె.సునీత, కమిషనర్ ఎంఎం నాయక్ తదితర అధికార యంత్రాంగం రాష్ట్రంలోని చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఉప్పాడ జమ్ధానీ పట్టు చీరలకు ప్రచారం, మార్కెటింగ్ కల్పించడంలో ప్రత్యేక కృషి జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఒడిఒపి) పథకంలో ఎంపిక చేశారు. ఈ ఏడాది ఒడిఒపి పథకంలో జాతీయ అవార్డుకు సైతం దరఖాస్తు చేయడంతో కొద్ది రోజుల క్రితం కేంద్ర బృందం ఉప్పాడకు వచ్చి పరిశీలించి వెళ్లింది. ఉప్పాడ పట్టు చీరల నేతకు ప్రాముఖ్యత ఇస్తూ పోస్టల్ కవర్ కూడా రిలీజ్ చేయడం విశేషం. వస్తువుల భౌగోళిక సూచికల (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) చట్టం–1999 ద్వారా జియో ట్యాగింగ్(గుర్తింపు) ఇచ్చారు. ప్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం, వాట్సాప్ ద్వారా కూడా పలు డిజైన్లను విక్రయించడం వంటి వాటి ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.
ఉప్పాడ పట్టు చీరలకు యమా క్రేజ్..
ఉప్పాడ చీరలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తొలినాళ్లలో పిఠాపురం, వెంకటగిరి, బొబ్బిలి రాజవంశీయుల కోసం ప్రత్యేకమైన డిజైన్లతో చీరలు నేసేవారు. తర్వాతికాలంలో రాజకీయ నేతల నుంచి ధనవంతులు సైతం వీటిపై మొగ్గు చూపారు. తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వరకు చాలా మంది మహిళా నేతలు ఈ చీరలు ధరించారు. రానురాను అనేక ప్రాంతాలకు చెందిన వారు తమ కుటుంబాల్లో వివాహాల కోసం ఉప్పాడకు వచ్చి చీరలు కొనుగోలు చేస్తుంటారు. పట్టు జరీని బట్టి రూ.4,500 నుంచి రూ.3 లక్షల విలువైన చీరలు నేయడం ఇక్కడి నేతన్న ప్రత్యేకం. ఇక్కడ 150 వరకు రిటైల్, హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తుండటంతో చేనేతపై ప్రత్యక్షంగా ఆధారపడిన దాదాపు ఐదు వేల మంది, పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభిస్తోంది.
ఏటా రూ.50కోట్ల ఉత్పత్తులు
ఉప్పాడ కేంద్రంగా ఏటా రూ.40 కోట్ల నుంచి 50 కోట్ల నేత ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 70 శాతం ఉత్పత్తులు స్థానిక మార్కెట్‌లోనే విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ చేనేతపై ఆధారపడిన కళాకారులను అన్ని వి«ధాలుగా ప్రభుత్వం ఆదుకుంటోంది. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున ఉప్పాడలో 601 మందికి నేతన్న నేస్తం అందించింది. 420 మందికి రూ.2,750 చొప్పున పెన్షన్ ఇస్తోంది. గొల్లప్రోలు, ప్రత్తిపాడులో ప్రత్యేకంగా రూ.కోట్లతో క్ల్లస్టర్లు ఏర్పాటు చేసింది. గత నెల 20న రూ.96 లక్షలతో 320 మందికి యంత్ర పరికరాలు పంపిణీ
జరిగింది.
–కె.పెద్దిరాజు, కాకినాడ జిల్లా హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ఆఫీసర్
అవార్డు దక్కడం ఉప్పాడకు గర్వకారణం
ఉప్పాడ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీకి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కడం గర్వకారణం. 1938లో ప్రారంభమైన ఈ సొసైటీ ప్రస్తుతం 515 మంది సభ్యులతో సేవలు అందిస్తోంది. ఉప్పాడ∙చీరల నేతలో తమదైన సేవలు అందిస్తున్న వడిగే వీరరాఘవులు అనే నేత కళాకారుడు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. లొల్ల సత్యనారాయణ మార్కెటింగ్‌లో జాతీయ అవార్డు అందుకున్నారు. తాతోలు దేవి, దైవం త్రిమూర్తులు నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నారు. తాజాగా వైఎస్సార్ అవార్డు దక్కడంతో మరింత గుర్తింపు దక్కింది.
–కె.చేతన్, పర్సన్ ఇన్‌చార్జి, ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ

జాంధానీ చీర నేస్తున్న చేనేత కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment