నేటి యువతకు ఆయన స్ఫూర్తి
ప్రాణాయామమే ఆరోగ్య రహస్యం
కోవిడ్ నేర్పిన పాఠాలెన్నో..
చిట్టబ్బాయి లైఫ్‌స్టైల్ ఇదీ..
సాక్షిప్రతినిధి, కాకినాడ: కొంతమంది యువకులూ.. పుట్టుకతో వృద్ధులు అని ఆ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన పాట.. నిండా ముప్పై ఏళ్లు కూడా లేని యువకులు మోకాళ్ల నొప్పులంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిటారుగా వంగి నేలమీద ఉన్న వస్తువులను కూడా తీయలేక.. కూర్చుంటే పైకి లేవలేని యువత మనకు తరచూ తారసపడుతూనే ఉంటారు. ఇంటిలో చిన్నా చితకా తల్లి చెప్పే పనులు కూడా చేయలేక తప్పించుకునే యువత ఎందరో.. అటువంటిది నాగులాపల్లిలో తమ్మిలి శెట్టి చిట్టబ్బాయ్‌ని చూస్తే ఓల్డ్‌మేన్ అంటారు.
కానీ అతని నడక, నడత చూసిన వారెవరైనా నో.. హీ ఈజ్ హీమేన్ అని అంటారు. అంతటితోనే ఆగకుండా ఉక్కుమనిషి అని కూడా పిలుస్తుంటారు. ఆ శతాధిక వృద్ధుడి జీవిత పాఠాల నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది. ఆయన జీవినశైలి సంపూర్ణ ఆరోగ్యానికి కేరాఫ్‌గా అడ్రస్ అనడంలో సందేహమే లేదు. విధి విసిరిన దెబ్బను తట్టుకుని నో.. నేను నేనే అని నిరూపించుకున్న అతనెవరో కాదు కాకినాడకు 12 కిలోమీటర్లు దూరాన ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి అనే చిన్న పల్లెటూరికి చెందిన సామాన్య రైతు తమ్మిలిశెట్టి చిట్టబ్బాయి. చదువుకున్నది ఒకటో తరగతే. ఆ అక్షరాలు కూడా తీరంలోని ఇసుకపై దిద్దినవే. వయస్సు మీద పడిందనే ఆలోచనే ఎప్పుడూ మనసులోకి రానివ్వలేదంటారు చిట్టబ్బాయి. విభిన్నమైన జీవనశైలితో ఇప్పటికీ ఉక్కు మనిషిగా కనిపిస్తుంటారు.
చిన్నతనం నుంచి వ్యవసాయమే చిట్టబ్బాయి జీవనాధారం. అలా వ్యవసాయం చేస్తుండగా నాలుగు పదుల వయస్సులో చెట్టుపై నుంచి పడిపోయి వెన్నుపూస దెబ్బతింది. ఇరుగు, పొరుగు చిట్టబ్బాయి పని అయిపోయిందని, వైద్యులేమో ఇక లేవడం, నిలబడడం కష్టమనే చెప్పారు. అక్కడే ఆయనలోని సాధకుడు మేల్కొన్నాడు. ఏదో సరదాగా నేర్చుకున్న కర్రసాము, యోగా, చెరువులో ఈతకొట్టడం, వ్యాయామాలను సీరియస్‌గానే తీసుకుని సాధన చేశారు. నడుం నిలబడే వరకూ తనతో తానే పోరాడి అనుకున్నది సాధించారు. ఏడాదిన్నర తిగరకుండానే తన పనులు తాను చేసుకోవడం మొదలు పెట్టి ‘ఎక్కడా తగ్గేదేలే’ అంటూ అంత వయసులో కూడా రోబో చిట్టిలా జీవితంలో దూసుకుపోతున్నారు.
చిట్టబ్బాయి భార్య చనిపోయి చాలా ఏళ్ల అయ్యింది. పిల్లలను ఇబ్బంది పెట్టకూడదని, చిన్నప్పటి నుంచి ఎవరి పనులు వారు చేసుకోవాలనే కఠిన నిర్ణయాన్ని కొనసాగిస్తూ కాయగూరలు, ఆకు కూరలనే ఎక్కువగా వినియోగించి కూరలను తింటుంటారు. ప్రతి రోజు భోజనం తయారుచేసేటప్పుడే బియ్యంలో పెసరపప్పు వేసుకుని ఉడికిస్తుండడంతో పోషకాలు ఎక్కువగా లభించే బలవర్థక ఆహారమే తీసుకుంటారు. తెల్లవారకుండానే నాలుగు గంటలప్పుడు లేచే చిట్టబ్బాయి యోగా, ప్రాణాయామం క్రమం తప్పకుండా చేస్తూంటారు. ఏళ్ల తరబడి అలా చేయడమే తన ఆరోగ్య రహస్యమంటారు.
కాలాన్ని, వృద్ధాప్యాన్ని సూర్యకాంతిని అడ్డుపెట్టి ఆపలేరు. మన శరీర ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనపైనే ఉందని తెలుసుకోవాలంటారాయన. సంతోషంగా సౌకర్యవంతమైన వృద్ధాప్యాన్ని గడపడానికి చిన్నపాటి వ్యాయామం, ధ్యానంతో కూడిన ఏదో ఒక దినచర్య అనుసరించాలనేది అతని పిలాసఫీ. జాతిపిత గాంధీజీలా చిన్న అంగాస్త్రం ధరించి కర్రతో కనిపించిన చిట్టబ్బాయిని పలకరిస్తే నేటి తరానికి ఓ మార్గదర్శిగా కనిపిస్తారు. టీవీ చూసినా ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాలకే పరిమితమవుతారు. శరీర వ్యాయామంతో పాటు మిగిలిన సమయాల్లో మనసు ఉల్లాసంగా ఉండటం కోసం ఫ్లూట్‌తో జానపద, సినీ, ఆధ్యాత్మికమైన పాటలు కూడా వినసొంపుగా పాడటంలో చిట్టబాయ్ దిట్టే.
కోవిడ్–19 తరువాత జీవనశైలి పూర్తిగా మారిపోయిందంటారు చిట్టబ్బాయి. కోవిడ్ ముందు వరకూ సంపాదనే పరమావధిగా భావించే వారు కోవిడ్ మహమ్మారి విలయం ప్రత్యక్షంగా చూశాక ఆరోగ్యంపై అవగాహన చైతన్యం అవసరం అంటారాయన. వెనకేసిన రూ.కోట్లతో ఆరోగ్యాన్ని పొందలేమని కొంతలో కొంత శారీరక శ్రమ అవసరం, మనుషుల మనస్సులు గెలవడం ఎంతో అవసరమని కోవిడ్ మహమ్మారి గుర్తు చేసిందని ఆయన చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment