ఫొటో స్టూడియోలో చోరీ
దేవరపల్లి: స్థానిక ఆర్‌కే డిజిట్ ఫొటో స్టూడియోలో గురువారం తెల్లవారు జామున చోరీ జరిగింది. గుండుగొలను–కొవ్వూరు రాష్ట్ర ప్రధాన రహదారి(పాత) పక్కన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి సమీపంలో గల డిజిటల్ స్టూడియోలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు కారులో వచ్చి స్టూడియో షట్టర్ తాళం బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించినట్టు సమీపంలోని సీసీ కెమెరాల పుటేజ్‌లో నమోదైంది. స్టూడియో యజమాని కె.రామకృష్ణ కథనం ప్రకారం బుధవారం రాత్రి పెళ్లి ఫొటోలు తీసి 2.30 గంటలకు స్టూడియోకు వచ్చి కెమెరాలు, హెచ్‌పీ ల్యాప్‌టాప్ స్టూడియోలో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఉదయం 9 గంటల సమయంలో స్టూడియోకి వచ్చి చూడగా తాళం బద్దలు కొట్టి ఉంది. షట్టర్ తీసి లోపలకు వెళ్లి చూడగా రెండు కెమెరాలు, హెచ్‌పీ ల్యాప్‌టాప్, రెండు హార్డ్ డిస్క్‌లు దొంగిలించుకుపోయినట్టు గుర్తించారు. హార్డ్ డిస్క్‌ల్లో సుమారు 30 పెళ్లిళ్ల ఫొటోలు ఉన్నట్టు ఆయన చెప్పారు. 3 గంటల సమయంలో చోరీ జరిగి ఉంటుందని ఆయన తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై వి.సుబ్రహమణ్యం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కారుకు నంబరు ప్లేట్‌కు స్టిక్కర్ అతికించి దొంగలు జాగ్రత్త పడ్డారు. కూ్‌ల్స్ టీం వేలిముద్రలను సేకరించింది. బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహమణ్యం తెలిపారు. చోరీ జరిగిన వస్తువుల విలువ సుమారు రూ.1.80 లక్షలు ఉంటుందని చెప్పారు. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారిలోని మూడు రోడ్లు కూడలి ప్రదేశంలో ఇటు వంటి చోరీలు జరగడం పట్ల వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.
రెండు కెమెరాలు,
లాప్‌టాప్ దొంగల పాలు
చోరీ సొత్తు విలువ రూ.1.80 లక్షలు


