వలస కార్మికులకు ప్రయోజనం
కలిగేలా విదేశాంగ శాఖ నిర్ణయం
గతంలో ప్రమాదవశాత్తు జరిగే
మరణాలకే బీమా లబ్ధి
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పని చేస్తున్న భారతీయ వలస కార్మికులకు బీమా ప్రయోజనాలను విస్తరింప చేస్తూ విదేశాంగ శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. యూఏఈలో పని చేస్తున్న మన వలస కార్మికుల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తేనే బీమా లబ్ధి చేకూరేది. ఇప్పుడు అమలు చేస్తున్న కొత్త విధానాలతో సాధారణ మరణాలకు కూడా బీమా లబ్ధి కలుగనుంది. యూఏఈలో పని చేస్తున్న భారతీయ వలస కార్మికులకు లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ (ఎల్‌పీపీ) పథకం విస్తృతం చేస్తూ మన కాన్సులేట్ అధికారులు ఇటీవల నిర్ణయించారు. ఈ కొత్త పథకం అమలులోకి రావడం వల్ల యూఏఈలో పని చేస్తున్న తెలంగాణ వలస కార్మికులు దాదాపు 5.50 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఓరియంట్ బీమా కంపెనీ అల్ గార్గశ్ అనే మరో కంపెనీ మధ్యవర్తిత్వంతో వలస కార్మికులకు ఎల్‌పీపీని అమలు చేయనుంది. ఇది వరకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బీమా ప్రయోజనాలు దక్కేవి. ఇక నుంచి సాధారణ మరణాలకు సైతం ఇలాంటి లబ్ధి చేకూరుతుంది. యూఏఈలోని మన విదేశాంగ శాఖ మంచి నిర్ణయం తీసుకున్నా ఇతర గల్ఫ్ దేశాలైన సౌది అరేబియా, ఒమాన్, బహ్రెయిన్, కువైట్, ఖతర్ దేశాల్లోను పని చేస్తున్న భారతీయ వలస కార్మికులకు కూడా ఇలాంటి బీమా ప్రయోజనాలను వర్తింపచేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
అనారోగ్య సమస్యలే ఎక్కువ...
గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు జరిగే మరణాల కంటే ఆనారోగ్యం కారణంగా మృత్యువాత పడుతున్న వలస కార్మికుల సంఖ్య అధికంగానే ఉంది. గడచిన నాలుగేళ్ల కాలంలో తెలంగాణ వలస కార్మికులు సుమారు 2 వేల మంది మరణించి ఉంటారని అంచనా. వలస కార్మికులు కుటుంబాలను విడిచి దూరంగా ఉంటూ మనో వేదన చెందుతున్నారు. ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతం అవుతున్న వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉంటూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఎల్‌పీపీ పథకం అన్ని గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికులకు వర్తింప చేస్తూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటే ఎంతో మంది కార్మికుల కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment