భిక్కనూరు: కన్న తండ్రి అకాల మరణం ఒకవైపు, ఇన్నాళ్లూ కష్టపడి చదివి ఉన్నత చదువులకు ఓ మెట్టు ఎక్కే కీలకమైన ఎస్సెస్సీ పరీక్ష మరోవైపు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. మండల కేంద్రానికి చెందిన బీబీపేట సత్యం బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన పెద్ద కూతురు కీర్తన జంగంపల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తండ్రి మరణ విషయాన్ని బంధువులు కీర్తనకు చేరవేయగా బోరున విలపించింది. అదే దుఃఖంతో కీర్తన పరీక్షకు హాజరైంది. అనంతరం ఆమె మేనమామ వెంట బెట్టుకొని సత్యం అంత్యక్రియలు జరిగే మెదక్ జిల్లా నస్కల్‌కు తీసుకెళ్లాడు. సత్యం ముగ్గురు కుమార్తెలు, ఆయన భార్య రోదనలు మిన్నంటాయి.


