లింగంపేట/ఎల్లారెడ్డిరూరల్ : మండలంలోని మాలపాటి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కంపె ఆశయ్య(46) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆశయ్య మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి నుంచి బైక్‌పై స్వగ్రామం మాలపాటికి వస్తుండగా శివ్వాపూర్ సమీపంలో ఎదురుగా సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఎల్లారెడ్డికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జీపీహెచ్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్
● ఒకరి మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మంగ్లూర్ గేటు వద్ద సంగారెడ్డి– నాందేడ్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై శివకుమార్ తెలిపారు.
ఆటో, బైక్ ఢీ : ఇద్దరికి తీవ్ర గాయాలు
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చర్చి ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రామారెడ్డికి చెందిన ఎర్రోళ్ల రాజు, గోదలకాడ శ్రీనుకు తీవ్రగాయాలు కాగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వద్ద లభించిన నగదు రూ.4,800లను ఏరియా ఆస్పత్రి కానిస్టేబుల్ లక్ష్మణ్ వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.


