‘దోషులు ఎవరైనా ఉపేక్షించం’
నిజాంసాగర్: పదోతరగతి గణితం ప్రశ్నలు బయటకు వచ్చిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దోషులు ఎవరైనా ఉపేక్షించబోమని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ఫోన్ ద్వారా మాట్లాడారు. జుక్కల్ జెడ్పీహెచ్‌ఎస్‌లోని పరీక్ష కేంద్రంనుంచి గణితం పేపర్‌లోని ప్రశ్నలు ఓ చిట్టీ ద్వారా బయటపడిన విషయం తెలియగానే విద్యాశాఖ అధికారులతోపాటు బాన్సువాడ సబ్‌కలెక్టర్‌ను, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశానన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మరింత అప్రమత్తంగా ఉండాలని, పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
‘వినూత్న పద్ధతులు
అవలంబించాలి’
కామారెడ్డి టౌన్: చేపల పెంపకంలో వినూత్న పద్ధతులు అవలంబించాలని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ సూచించారు. గురువారం కళాశాలలో జువాలజీ, ఫిషరీస్ విభాగాల ఆధ్వర్యంలో ‘ఆధునిక, సమర్థవంతమైన చేపల పెంపకం విధానం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ చేపల పెంపకం ద్వారా ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్క్ సొల్యూషన్ ముర్రెల్ ఫిష్ ఇండస్ట్రీ రిసోర్స్ పర్సన్ మాధవి, కళాశాల ఐక్యూఏసీ సమన్వయకర్త జయప్రకాష్, వృక్షశాస్త్ర శాఖాధిపతి దినకర్, హిందీ శాఖాధిపతి శ్రీనివాసరావు, అధ్యాపకులు ఫర్హిన్ ఫాతిమా, మానస, పవన్, విద్యార్థులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలోని మైనారిటీ, ఎస్సీలు వచ్చేనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన పథకాలకు 21 నుంచి 60 ఏళ్లలోపు వారు, ఇతర పథకాలకు 21 నుంచి 55 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు.
రేపు జాబ్‌మేళా
కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్‌లో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగల 20 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు పురుషులు 76719 74009 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2020–24 బ్యాచ్ డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యార్థుల వినతి మేరకు ఏప్రిల్ 7వరకు పొడిగించినట్లు కంట్రోలర్ సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సులకు సంబంధించి 2, 4, 6వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 3, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు (ఏప్రిల్, మే 2025 లో) హాజరయ్యే విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందన్నారు. రూ.100 అపరాధ రుసుముతో ఏప్రిల్ 8వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
‘దోషులు ఎవరైనా ఉపేక్షించం’


